పర్యావరణ కోణంలోనే చూడాలి

3 Mar, 2021 04:09 IST|Sakshi

భోగాపురం విమానాశ్రయ పర్యావరణ అనుమతుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: పర్యావరణానికి సంబంధించిన కేసులను పర్యావరణ కోణంలోనే చూడాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆలస్యంగా పిటిషన్‌ దాఖలు చేశారని విచారించబోమని పేర్కొనడం సరికాదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో భోగాపురం విమానాశ్రయానికి 2017 ఆగస్టులో అనుమతులు వచ్చాయి. వీటి విషయంలో నిబంధనలు పాటించలేదంటూ స్థానికురాలు దాట్ల శ్రీదేవి చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ)ను ఆశ్రయించారు. 90 రోజుల్లోగా పిటిషన్‌ దాఖలు చేయలేదని.. ఈ ఆలస్యం కారణంగా విచారించబోమని ఎన్జీటీ ఆదేశాలు వెలువరించింది.

వీటిని సవాల్‌ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం న్యాయమూర్తులు జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ రవీంద్రభట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరిస్తూ ఎన్జీటీ ఆదేశాలను పక్కనపెడుతున్నట్లు పేర్కొంది. పర్యావరణ అనుమతుల పత్రాలు అధిక సంఖ్యలో ఉన్నాయని.. వాటిని అధ్యయనం చేయడం, సాంకేతిక, ఇతర అంశాలపై నిపుణులతో సంప్రదింపులకు సమయం పట్టినందున పిటిషన్‌ దాఖలు చేయడంలో ఆలస్యమైందన్న పిటిషనర్‌ వాదనలతో ఏకీభవిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. పిటిషనర్‌తోపాటు ఇతరులు కూడా ఎన్జీటీ ముందు వాదనలు వినిపించొచ్చని పేర్కొంది.  

>
మరిన్ని వార్తలు