సూర్య, చంద్ర గ్రహణ రోజుల్లో.. 12 గంటలు శ్రీవారి ఆలయం మూసివేత 

8 Sep, 2022 03:56 IST|Sakshi

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్‌ 25న సూర్యగ్రహణం, నవంబర్‌ 8న చంద్రగ్రహణం కారణంగా ఆయా రోజుల్లో 12 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. ఈ మేరకు బ్రేక్‌ దర్శనం, శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. సర్వదర్శనం భక్తులను మాత్రమే అనుమతిస్తారు. అక్టోబర్‌ 25న మంగళవారం సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది.

ఈ కారణంగా ఉదయం 8.11 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. నవంబర్‌ 8న మంగళవారం మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. కాగా,  తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 13 కంపార్ట్‌మెంట్లు నిండాయి. దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. 

మరిన్ని వార్తలు