ప్రభుత్వ ప్రోత్సాహం తోడై.. ఆత్మ విశ్వాసం నీడై

3 Dec, 2023 03:00 IST|Sakshi

సర్కారు వెన్నుదన్నుతో రాణిస్తున్న విభిన్న ప్రతిభావంతులు

విద్యలో 5 శాతం రిజర్వేషన్‌తోపాటు అవాంతరాలు లేని చదువు 

ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు 

ప్రభుత్వ ఉద్యోగులకు అదనంగా 7 రోజుల ప్రత్యేక సెలవులు 

మూడు చక్రాల మోటార్‌ సైకిళ్లు, పరికరాలు అందజేత 

సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో దేశానికే ఆదర్శం 

నేడు విభిన్న ప్రతిభావంతుల అంతర్జాతీయ దినోత్సవం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వ ప్రోత్సాహం తోడైంది. దానిని అందిపుచ్చుకుంటూ వారంతా ఆత్మ విశ్వాసంతో నిలబడుతున్నారు. నాలుగున్నరేళ్లలో విభిన్న ప్రతిభావంతుల కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్ర జనాభాలో 2.23 శాతం (సుమారు 11.04లక్షలు) మంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నా­రు. వివిధ వైకల్యాలతో బాధపడుతున్న 21 రకాల వారిని విభిన్న ప్రతిభావంతులుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వారంతా సమా­జంలో నిలదొక్కుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వీరంతా స్వయం ప్రతిపత్తి, సాధికారత సాధించేలా.. ప్రతిభావంతులుగా నిలబెట్టేందుకు కృషి చేస్తోంది. ప్రత్యేకంగా విద్య, ఉద్యోగం, ఉపాధి కల్పించేందుకు అనేక చర్యలు చేపట్టింది. వారి సమస్యలు గుర్తించి పరిష్కరించే దిశగా రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, వయో వృద్ధులు, విభిన్న ప్రతి­భావంతుల సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షతన రాష్ట్రస్థాయి సలహా మండలిని నియమించింది. కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీలను సైతం ఏర్పాటు చేసింది.

విభిన్న ప్రతిభావంతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేలా ప్రతి శాఖలోను ప్రత్యేక అధికారిని నియమించింది. ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో వారికి 4 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ఏపీ స్టేట్, సబార్డినేట్‌ రూల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. వైకల్యం ఉందన్న కారణంతో వారికి పదోన్నతి నిరాకరించడం, ఉన్న పోస్టు నుంచి తగ్గించడం, తొలగించడం చేయకూడదని ప్రభుత్వం అన్ని శాఖలకూ స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

సదరం ద్వారా వైకల్యం ధ్రువీకరణ పత్రాలు అందించడాన్ని సైతం సులభతరం చేసింది. ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో వారికి 5 శాతం రిజర్వేషన్‌ కల్పించింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రవేశానికి సైతం గరిష్టంగా ఐదేళ్ల వయోపరిమితిని సడలించింది. దీంతోపాటు విద్యాలయాలు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలకు విభిన్న ప్రతిభావంతులు వెళ్లి వచ్చేందుకు ఎటువంటి అవాంతరాలు (అడ్డంకులు) లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు.

పెద్ద మనసుతో ఎన్నో చర్యలు
రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకు విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పెద్ద మనసుతో అనేక చర్యలు చేపట్టారు. ఈ ఏడాది 1,750 మూడు చక్రాల మోటార్‌ సైకిళ్లు, అనేక సహాయక పరికరాలు అందించాం.

అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో వారికి సీట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవడంతో పాటు, బడికి వెళ్లేలా సౌకర్యాలు కల్పించాం. చెవిటి, మూగ వారికి, అంధ విద్యార్థులకు 640 మందికి ప్రత్యేకంగా ఆరు ప్రత్యేక విద్యాసంస్థల్ని నిర్వహిస్తున్నాం. జగనన్న వసతి దీవెన, స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నాం. ప్రత్యేక భర్తీతో 691 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. – కేవీ ఉషశ్రీ చరణ్,  మహిళా, శిశు, వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల శాఖ మంత్రి

ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది 
విభిన్న ప్రతిభావంతులను అన్నివిధాల ఆదుకోవడంలో ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమంలో వారి పట్ల  వైఎస్‌ జగన్‌ అభిమానం చాటుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ సెలవులు 15 రోజులు ఉంటే.. విభిన్న ప్రతిభావంతులకు మరో 7 రోజులు అదనంగా స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్స్‌ ఇస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.సామాజిక భద్రత పెన్షన్లు అందించడంలో ఆంధ్రప్రదేశ్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.4,201.26 కోట్లు కేటాయించింది. – బి.రవిప్రకాశ్‌రెడ్డి, సంచాలకుడు, వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ

మరిన్ని వార్తలు