Vizag: పోగొట్టుకున్న విలువైన బ్యాగు.. గంటల వ్యవధిలో

14 Dec, 2023 18:56 IST|Sakshi

విశాఖపట్నం: మహిళ పోగొట్టుకున్న విలువైన బ్యాగును గంటల వ్యవధిలో చేధించి తిరిగి ఆమెకు విశాఖపట్నం నగర పోలీసులు అందించారు. బుధవారం సాయింత్రం సుమారు 04.30 గంటల సమయంలో కే.భారతి అనే మహిళ భీమిలి నగరంపాలెం నుంచి ఎం.వీ.పీ సర్కిల్ వరకు ఒక పాసింజర్ ఆటో ఎక్కింది. సర్కిల్ వద్ద ఆటో దిగే సమయంలో తనతో పాటు తెచ్చిన బ్యాగును తీసుకోవడం మర్చిపోయి , కొంత సమయం తర్వాత ఆమె బ్యాగును మర్చిపోయినట్లు గుర్తించి చుట్టుప్రక్కల ఆటో కోసం వెతుకగా కనపడకపోవడంతో ఎం.వీ.పీ క్రైమ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

ఆ బ్యాగులో 5 తులాల బంగారు ఆభరణాలు, 50 గ్రాముల వెండి వస్తువులు, 18,000 నగదు ఉన్నాయని తెలిపారు. తక్షణం స్పందించి.. ఆమె తెలిపిన వివరాలు ఆధారంగా కానిస్టేబుల్‌ పీ.హరి, అప్పుఘర్ ఆటో స్టాండ్‌లో ఉండే దూడ సత్యనారాయణ అనే ఒక ఆటో డ్రైవర్ సహాయంతో సదరు ఆటోను కనిపెట్టారు. సదరు ఆటో డ్రైవర్ ఆర్. కొండలరావు అలియాస్‌ రాజు కూడా స్వచ్ఛందంగా బ్యాగ్‌ను అప్పగించడానికి వస్తున్నట్లు తెలిపారు.

గురువారం అడిషనల్ డీజీపీ, కమీషనర్ ఆఫ్ పోలీస్ అండ్‌ అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ డా. ఏ.రవి శంకర్‌ చేతుల మీదుగా బాధితురాలికు ఆమె బ్యాగును అందజేసి , బ్యాగ్ కనిపెట్టడంలో ప్రతిభ కనబర్చిన ఎంవీపీ కానిస్టేబుల్ పి.హరిని మెరిట్ సర్టిఫికెట్ ఇచ్చి అభినందించారు. అదే విధంగా బ్యాగును కనిపెట్టడంలో సహాయం చేసిన సత్యనారాయణ, స్వచ్ఛందంగా బ్యాగును అప్పగించిన రాజును ప్రత్యేకంగా అభినందించి క్యాష్ రివార్డులు అందజేశారు.

చదవండి:  ఈనాడు ట్యాబ్‌ కథనంపై మంత్రి బొత్స ఫైర్‌

>
మరిన్ని వార్తలు