'ఆయన అకాల మరణం నన్నెంతో బాధించింది'

5 Oct, 2020 12:32 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) మాజీ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌కు రాష్ట్ర మంత్రులు, పలు పార్టీల నాయకులు సోమవారం ఘన నివాళులు అర్పించారు. డాక్టర్స్ కాలనీలో ద్రోణంరాజు శ్రీనివాస్ భౌతిక కాయాన్నిసంద‌ర్శించి పార్టీలకతీతంగా నివాళులు అర్పించారు. విశాఖ అభివృద్ధిలో ద్రోణంరాజు శ్రీనివాస్ చెరగని ముద్ర వేశారని, ఆయన మరణం పార్టీకీ తీరని లోటని వైస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ద్రోణంరాజుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 

వైజాగ్ అభివృద్ధికి పరితపించే వాడు: కోన రఘుపతి, డిప్యూటీ స్పీకర్
‘నాకు ద్రోణంరాజు శ్రీనివాస్‌ మంచి స్నేహితుడు. వైజాగ్ అభివృద్ధిలో కీలక భాగస్వామి అయ్యారు. వైజాగ్ అభివృద్ధి కోసమే  శ్రీనివాస్ పరితపించే వాడు. ద్రోణంరాజు మరణం విశాఖపట్నానికి తీరని లోటు. ఆయన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించేవారు. భగవంతుడు చాలా త్వరగా ద్రోణంరాజు శ్రీనివాస్‌ను తీసుకెళ్లిపోయారు. ద్రోణంరాజు శ్రీనివాస్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించమని సీఎం  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. తన మామ గారు చనిపోవడంతో ద్రోణంరాజు అంత్యక్రియలకు రాలేకపోతున్నానని సీఎం జగన్ తెలిపార’ని డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి తెలిపారు. (విశోక సంద్రం.. నగరం మదిలో ద్రోణం'రాజే')

అత్యంత విషాద కరమైన రోజు: అవంతి
‘ఈ రోజు అత్యంత విషాద కరమైన రోజు. ద్రోణంరాజు శ్రీనివాస్ నాకు అత్యంత ఆప్తుడు. ఆయన అకాల మరణం నన్ను ఎంతో బాధించింది. పేదల కోసం ఆయన ఎంతో శ్రమించారు. ద్రోణంరాజు విలువలతో కూడిన రాజకీయాలు చేశార’ని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు.

విశాఖ అభివృద్ధిలో వారిది కీలక పాత్ర: వాసుపల్లి గణేష్
‘ద్రోణం రాజు మరణాన్ని విశాఖ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. విశాఖ అభివృద్ధిలో ద్రోణంరాజు సత్యనారాయణ ఆయన కుమారుడు శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. విశాఖ చరిత్రలో ఒక పేజీ వాళ్ళ కుటుంబానికి ఉంటుంద’ని ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ అన్నారు.  (ద్రోణంరాజు శ్రీనివాస్‌కు నివాళులు)

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఓ ల్యాండ్ మార్క్: పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి
‘గిరిజన ప్రాంత ప్రజలతో ద్రోణంరాజు కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. ద్రోణంరాజు సత్యనారాయణ, ద్రోణంరాజు శ్రీనివాస్‌లు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఓ ల్యాండ్ మార్క్’ అని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి పేర్కొన్నారు.

మంచితనానికి నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు ద్రోణంరాజు శ్రీనివాస్ అని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు.

మరిన్ని వార్తలు