'ప్రమాదం అంటే ఓ వ్యక్తి రోడ్డున పడటం కాదు..ఒక కుటుంబం రోడ్డున పడటం'

3 Aug, 2022 16:07 IST|Sakshi

ప్రమాదం అంటే ఓ వ్యక్తి రోడ్డున పడటం కాదు..ఒక కుటుంబం రోడ్డున పడటం. ఇంట్లో పెద్ద దిక్కు రోడ్డు ప్రమాదానికి గురై మంచనా పడితే ఆ బాధ వర్ణనాతీతం. కష్టాల్లో చేయందించే మానవ లోకంలో..అదే కష్టాలను చూస్తే కను చూపు తిప్పుకునే వాళ్లూ ఉన్నారు. అందుకే బడికెళ్లే ఏడేళ్ల బాలుడు డెలివరీ బాయ్‌గా మారాడు. కుటుంబ భారాన్ని మోస్తూ అందరి చేత శెభాష్‌ అనిపించుకుంటున్నాడు. 

అమ్మా..నాన్న..ఓ అబ్బాయి. అమ్మ చిన్నా చితాకా పనులు చేస్తుంటే.. నాన్న డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడు. ఆ అబ్బాయి బడికి వెళ్లే వాడు. అన్యోన్యమైన అనుబంధాలున్న ఆ పచ్చని కుటుంబాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో..ఆ కుటుంబానికి పెద్ద దిక్కైన తండ్రి రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. దీనితోడు ఆర్ధిక ఇబ్బందులు. ఓ వైపు నాన్న ట్రీట్మెంట్‌. ఆ పసి హృదయం తల్లడిల్లింది. అయితేనేం ఆ బాలుడు కుంగిపోలేదు. నాన్న వైద్యం, పోషణ కోసం కుటుంబ బారాన్ని మోసేందుకు సిద్ధమయ్యాడు. ఉదయం స్కూల్‌కు వెళ్లడం, సాయంత్రం 6గంటల నుంచి 11గంటల వరకు ఫుడ్‌ ఆర్డర్‌లు అందించే జొమాటో డెలివరీ బాయ్‌గా మారాడు. 

ఈ తరుణంలో ఢిల్లీలో నివాసం ఉంటున్న రాహుల్‌ మిట్టల్‌ అనే యువకుడు ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టాడు. రాహుల్‌కు ఆ ఫుడ్‌ను అందించేందుకు సైకిల్‌పై ఆ బాలుడి రావడం.. అతడి గురించి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన తండ్రి రోడ్డు ప్రమాదానికి గురైతే తన తండ్రి ప్రొఫైల్‌ మీద డెలివరీలు అందిస్తున్నట్లు చెప్పాడు. ఆ సంభాషణను రాహుల్‌ వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆ బాలుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

స్పందించిన జొమాటో
కష్టకాలంలో డెలివరీ బాయ్స్‌కు అండగా ఉంటామని మరోసారి నిరూపించింది జొమాటో. కొద్ది నెలల క్రితం మద్యం మత్తులో కానిస్టేబుల్‌ జిలే సింగ్‌ చేసిన తప్పిదానికి జొమాటో డెలివరీ బాయ్‌ సలీల్‌ త్రిపాఠి మరణించాడు. ఆయన మరణంపై విచారం వ్యక్తం చేసిన జొమాటో అండగా నిలిచింది. ఆర్ధిక సాయం చేసింది. ఇప్పుడు చిన్న వయస్సులో కుటుంబ బారాన్ని మోస్తున్న ఏడేళ్ల బాలుడికి సాయం చేసేందుకు సిద్ధమైంది. నెట్టింట్లో వైరల్‌ అవుతున్న బాలుడి వీడియోపై జొమాటో స్పందించింది. వ్యక్తిగత వివరాలు ఇవ్వాలని కోరింది.

మరిన్ని వార్తలు