రిస్క్ లపై ఇన్వెస్టర్లలో అవగాహన అంతంతే..

28 Sep, 2023 05:52 IST|Sakshi

సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుంటున్న వారు 27 శాతమే

యాక్సిస్‌ ఏఎంసీ సర్వేలో వెల్లడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కష్టపడి సంపాదించే ధనాన్ని భవిష్యత్‌ అవసరాల కోసం ఇన్వెస్ట్‌ చేసుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ఇదే క్రమంలో పెట్టుబడి సాధనంగా మ్యుచువల్‌ ఫండ్స్‌కి కూడా ఆదరణ పెరుగుతోంది. కానీ, ఇన్వెస్టర్లలో రిస్కులు, తమ రిస్కు సామర్థ్యాలపై అవగాహన అంతంతమాత్రంగాన ఉంటోంది.

సరైన మ్యూచువల్‌ ఫండ్‌ను ఎంచుకోవడంలో తమ రిస్కు సామర్థ్యాలను అర్థం చేసుకుని, వ్యవహరించడం కీలకాంశమని 89 శాతం మంది ఇన్వెస్టర్లు భావిస్తున్నప్పటికీ .. వాస్తవంగా ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు దాన్ని పరిగణనలోకి తీసుకుంటున్న వారు 27 శాతమే. 53 శాతం మంది ఇన్వెస్టర్లు తమ వ్యక్తిగత రిస్కుల మదింపు విషయంలో ధీమాగా వ్యవహరించలేకపోతున్నారు. యాక్సిస్‌ మ్యుచువల్‌ ఫండ్‌ (ఏఎంసీ) నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

మ్యుచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల్లో ఉండే రిస్కుల విషయంలో ఇన్వెస్టర్ల ధోరణిని తెలుసుకునేందుకు నిర్వహించిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 1,700 మంది పైచిలుకు యాక్సిస్‌ ఎంఎఫ్‌ ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. సర్వే నివేదిక ప్రకారం ఫండ్‌ రిస్కులను మదింపు చేసేందుకు రిస్‌్క–ఓ–మీటర్‌ అనే సాధనాన్ని ఉపయోగించుకోవచ్చని 55 శాతం మందికి, అలాగే వ్యక్తిగత రిస్కులను మదింపు చేసుకునేందుకు రిస్క్‌ ప్రొఫైలర్‌ను ఉపయోగించుకోవచ్చని 69 శాతం మందికి అవగాహన లేదు. దేశీయంగా మ్యుచువల్‌ ఫండ్‌ పరిశ్రమ కీలక దశలో ఉందని, ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు సరైన నిర్ణయాలు తీసుకోగలిగేలా వారికి మరింత తోడ్పాటు అందించేందుకు పరిశ్రమ కృషి చేస్తోందని యాక్సిస్‌ ఏఎంసీ ఎండీ బి. గోపకుమార్‌ తెలిపారు.

సర్వేలో మరిన్ని అంశాలు..
► ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రామాణికంగా తీసుకోతగిన అంశాల్లో, దాని గత పనితీరు కూడా ఒకటని 59% మంది ఇంకా విశ్వసిస్తున్నారు. పెట్టుబడులను దీర్ఘకాలికంగా కొనసాగించాల్సిన అవసరం, కాంపౌండింగ్‌ ప్రయో జనాల గురించి తెలిసినప్పటికీ చాలా మంది ఇ న్వెస్టర్లు పలు సందర్భాల్లో తమ పెట్టుబడులను ముందుగానే ఉపసంహరించుకుంటున్నారు.  
► పరిశ్రమ సమాఖ్య యాంఫీ గణాంకాల ప్రకారం 22.2% మంది ఈక్విటీ ఇన్వెస్టర్లు 12–24 నెలల పాటే తమ పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. 48.7% మంది తమ పోర్ట్‌ఫోలియోను రెండేళ్లు, అంతకన్నా తక్కువ వ్యవధిలోనే రిడీమ్‌ చేసుకుంటున్నారు.  
► పెట్టుబడులు పెట్టేటప్పుడు తమ రిస్కు సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పిన 27% మందిలో దాదాపు 64% మందికి రిస్కు సామర్థ్యాలను మదింపు చేసుకోవడానికి రిస్క్‌ ప్రొఫైలర్‌ సాధనాన్ని ఉపయోగించుకోవచ్చని తెలియదు. మొత్తం సర్వేలో పాల్గొన్న వారిలో 30% మందికి మాత్రమే రిస్క్‌ ప్రొఫైలర్‌ గురించి అవగాహన ఉంది.  
► 61% మందికి రిస్‌్క–ఓ–మీటర్‌ దేన్ని సూచిస్తుందనేది తెలియదు. ఇది ‘ఫండ్‌’ రిసు్కను సూచిస్తుందని 16% మందికి మాత్రమే తెలుసు. తాము పెట్టుబడులు పెట్టే ముందు రిస్కోమీటర్‌ను చూసుకునే ఇన్వెస్ట్‌ చేస్తామని సదరు ఇన్వెస్టర్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు