నేను చెప్తున్నాగా! ఎయిర్‌టెల్‌ భవిష్యత్తు బ్రహ్మాండం!

17 May, 2022 20:07 IST|Sakshi

న్యూఢిల్లీ: యుద్ధాలతో రాటుదేలిన తమ సంస్థ భవిష్యత్‌ బాగుంటుందని టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ ధీమా  ధీమా వ్యక్తం చేశారు. నియంత్రణ సంస్థలపరమైన సవాళ్లు, మార్కెట్లో తీవ్ర పోటీ వంటి అనేక ఎత్తుపల్లాలను చూసిన ఎయిర్‌టెల్‌ ప్రస్తుతం పటిష్ట స్థితిలో ఉందని ఆయన చెప్పారు.

‘దేశీయంగా టెలికం రంగంలో ప్రస్తుతం రెండున్నర సంస్థలు మాత్రమే మిగిలాయి. ఇక భవిష్యత్‌ బాగానే ఉండేలా కనిపిస్తోంది. మరో సంక్షోభం ఏదైనా వస్తుందా రాదా అంటే ఏమో ఎవరు చెప్పగలరు? అయితే, మా కంపెనీ యుద్ధాలతో రాటుదేలి చాలా పటిష్టంగా మారింది‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మిట్టల్‌ వివరించారు. ఈ సందర్భంగా 2002–2003 మధ్య ఎయిర్‌టెల్‌ ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. ఒకానొక దశలో కంపెనీ కుప్పకూలిపోవడం ఖాయమనే భావన నెలకొందని పేర్కొన్నారు.  

‘మేము దేశవ్యాప్తంగా సేవలను భారీగా విస్తరించడంపై దృష్టి పెట్టిన దశలో మా మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. చేతిలో డబ్బు వేగంగా కరిగిపోతోంది ఆదాయాలు పెరగడం లేదు. కొన్నాళ్ల క్రితమే రూ. 45 దగ్గర లిస్టయిన షేరు ధర రూ.19కి పడిపోయింది. ఓడలో పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఏది చేసినా కలిసి రావడం లేదు. అలాంటప్పుడు సరైన వ్యూహం, సరైన టెక్నాలజీ ఉంటే కచ్చితంగా గెలుపు మాదే అవుతుందనే నమ్మకంతో ముందుకెళ్లాం. అదే ఫలితాలనిచ్చింది.

 18 నెలల్లోనే షేరు రూ.19 నుంచి ఏకంగా రూ.1,200కు ఎగిసింది‘ అని మిట్టల్‌ వివరించారు. 2008–09లో కొత్తగా 12 సంస్థలు టెలికం లైసెన్సులు పొందినప్పుడు కూడా గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. కానీ తాము ఈసారి సిద్ధంగా ఉండి, దీటుగా ఎదుర్కొనగలిగామని మిట్టల్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు