Anand Mahindra: అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి

20 Jan, 2022 18:50 IST|Sakshi

స్కూల్‌ టైంలో పెద్దయ్యాక ఏమవుతావురా? అంటే.. సంకల్లో చేతులు కట్టుకుని సంతోషంగా ‘ఫలానా అయిపోతాం సార్‌’ అని చెప్తుంటాం. కానీ, కష్టపడి ఆ కలను నెరవేర్చుకునేవాళ్లం కొందరమే!. పరిస్థితుల మూలంగానో, ఇతర కారణాల వల్లనో కొందరు అనుకున్నవి సాధించలేకపోవచ్చు. ఆ లిస్ట్‌లో ఆనంద్‌ మహీంద్రా కూడా ఉన్నారు.  


ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా ఒక ఫిల్మ్‌ మేకర్‌ అనే  విషయం తాజాగా  ఓ ఫొటో ద్వారా బయటపడింది. ‘మహీంద్రా గ్రూప్‌ అనే ప్రతిష్టాత్మక కంపెనీని ముందుడి నడిపిస్తున్నారు. కానీ, చదువుకునే రోజుల్లో మీ లక్ష్యం ఏంటి?.. ఫేవరెట్‌ ప్రొఫెషన్‌గా దానిని మిస్‌ అవుతున్నారా?’ అని ట్విటర్‌లో ఈశ్వరన్‌ వ్యక్తి  ఎప్పుడో వారం కిందట ఆనంద్‌ మహీంద్రాను అడిగారు.  దానికి ఇప్పుడు రిప్లై ఇచ్చారు ఆయన. 

‘‘దానికి సమాధానం చెప్పడం సులువు. ఫిల్మ్‌ మేకర్‌ అవుదామనుకున్నా. కాలేజీలోనూ సినిమా కోర్స్‌ చేశా. 1977 కుంభమేళా సమయంలో ఒక సినిమా కూడా తీశా. కానీ, ఇక్కడ కనిపించే ఫొటో మాత్రం ఇండోర్‌ దగ్గర ఒక మారుమూల పల్లెలో డాక్యుమెంటరీని తీసేప్పుడు క్లిక్‌ మనిపించింది. ఇంతకీ ఈ ఫొటోలో నేను హ్యాండిల్‌చేసిన 16ఎంఎం కెమెరా ఏంటో ఎవరైనా చెప్పగలరా?’’ అంటూ ఓ ప్రశ్న సైతం నెటిజనులకు సంధించాడాయన.

కెరీర్‌కు ఎందుకు దూరం అయ్యారనే విషయం ఆయన చెప్పక్కపోయినప్పటికీ.. ఆయన బోల్తా కొట్టింది మాత్రం లేదు. ఎందుకంటే.. ఇప్పుడాయన బిలియనీర్‌ బిజినెస్‌ టైకూన్‌ కాబట్టి. ఇక ట్విటర్‌లో ఆయన పోస్ట్‌కి మాత్రం రకరకాల రియాక్షన్లు దక్కుతున్నాయి.  కొందరు చమక్కులు పేలుస్తుండగా.. మరికొందరు అయ్యిందేదో మంచికే అయ్యిందని ఆనంద్‌ మహీంద్రాకు సర్దిచెప్తున్నారు. ఇంకొందరు మాత్రం ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం.. అదేనండీ ఏ కంపెనీ కెమెరానో రిప్లై ఇస్తు‍న్నారు.

మరిన్ని వార్తలు