ఫాక్స్‌కాన్‌ తమిళనాడు ప్లాంటుపై యాపిల్‌ ఆంక్షలు

30 Dec, 2021 09:05 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉద్యోగులకు ఆహార, వసతి సదుపాయాల్లో లోపాలపై వివాదం నేపథ్యంలో ఐఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌కు చెందిన తమిళనాడు ప్లాంటును ప్రొబేషన్‌లో (పరిశీలన) ఉంచినట్లు టెక్‌ దిగ్గజం యాపిల్‌ వెల్లడించింది. కఠినమైన ప్రమాణాలను అమలుపర్చిన తర్వాతే యూనిట్‌ తిరిగి తెరుచుకునేలా చూస్తామని పేర్కొంది. ‘మా సరఫరాదారులకు పరిశ్రమలోనే అత్యుత్తమ ప్రమాణాలు పాటించాల్సిన బాధ్యత ఉంటుంది. ఇందుకోసం మేము తరచూ వాటి పనితీరును మదింపు చేస్తుంటాం. ఇదే క్రమంలో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌ ప్లాంటులో నిర్వహించిన తనిఖీల్లో ఉద్యోగుల డార్మిటరీలు, డైనింగ్‌ రూమ్‌లు మా ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. దీంతో ప్లాంటును ప్రొబేషన్‌లో ఉంచాం. సరఫరాదారు వేగవంతంగా దిద్దుబాటు చర్యలు తీసుకునేలా చూస్తున్నాం‘ అని యాపిల్‌ ప్రతినిధి తెలిపారు.  మరోవైపు, అత్యుత్తమ ప్రమాణాలు పాటించే దిశగా స్థానిక మేనేజ్‌మెంట్‌ బృందాన్ని, వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరిస్తున్నట్లు ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ ఒక ప్రకటనలో తెలిపింది. కార్యకలాపాలు పునఃప్రారంభించడానికి పట్టే కాలావధిలో ఉద్యోగులకు యథాప్రకారం వేతనాల చెల్లింపు కొనసాగుతుందని తెలిపింది.

ఉద్యోగుల ఆందోళన
యాపిల్‌కు ఫాక్స్‌కాన్‌ ఐఫోన్లను తయారు చేసి అందిస్తోంది. కంపెనీకి శ్రీపెరంబుదూర్‌లో ఉన్న ప్లాంటు ఉద్యోగులకు సంబంధించిన డార్మిటరీలో విషాహార ఉదంతం చోటుచేసుకోవడంతో సిబ్బంది ఇటీవల ఆందోళనలకు దిగారు. దీంతో ప్లాంటు మూతబడింది. ఆహారం, వసతి విషయంలో ఆందోళన వ్యక్తమవడంతో  యాపిల్‌ స్వంతంగా ఆడిటర్లను పంపించి, పరిశీలించింది. ఫాక్స్‌కాన్‌ దిద్దుబాటు చర్యలతో డిసెంబర్‌ 30 నాటికి ప్లాంటు తిరిగి తెరుచుకుంటుందనే అంచనాలు నెలకొన్నప్పటికీ.. తాజా పరిణామంతో ఈ విషయంలో మరింత జాప్యం జరగవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 
 

చదవండి:ఒక్కొక్కరికి రూ.కోటిన్నర దాకా బోనస్‌!.. వలసలను అడ్డుకునేందుకు టెక్‌ దిగ్గజాల పాట్లు

మరిన్ని వార్తలు