రూ. 2.85 లక్షల కోట్లకు మైక్రోఫైనాన్స్‌ రుణాలు  

10 Nov, 2022 08:25 IST|Sakshi

2025 నాటికి రూ. 17 లక్షల కోట్లకు చేరిక

ఎంఎఫ్‌ఐఎన్‌  సీఈవో అలోక్‌ మిశ్రా వెల్లడి  

ముంబై:  దశాబ్దం క్రితం రూ. 16 వేల కోట్లుగా ఉన్న సూక్ష్మ రుణాల వ్యాపార పరిమాణం గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 2.85 లక్షల కోట్లకు చేరింది. నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌-ఎంఎఫ్‌ఐలు, చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు, బ్యాంకులు మొదలైన దాదాపు 100 సంస్థలు ఈ రుణాలు ఇస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ఈ మార్కెట్‌ పరిమాణం రూ. 17 లక్షల కోట్లకు చేరగలదని పరిశ్రమ వర్గాలు రూపొందించిన నివేదికలో వెల్లడైంది. మైక్రోఫైనాన్స్‌ సంస్థల నెట్‌వర్క్‌ (ఎంఎఫ్‌ఐఎన్‌)  సీఈవో అలోక్‌ మిశ్రా ఈ విషయాలు తెలిపారు.

సగటు రుణ పరిమాణం, కాల వ్యవధులు పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం నాలుగింట మూడొంతుల రుణాల కాల వ్యవధి 18 నెలలకు పైగా ఉంటోందన్నారు. ఈ రంగం దాదాపు 1.6 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తోందని మిశ్రా వివరించారు. ఎక్కువగా రుణ కార్యకలాపాలు టాప్‌ 300 జిల్లాలకు మాత్రమే పరిమితమవుతున్నాయని, వీటిని మరింతగా విస్తరించాల్సి ఉందని చెప్పారు. మరోవైపు, రెండేళ్ల కోవిడ్‌ దెబ్బతో మైక్రోఫైనాన్స్‌ సంస్థలు 5–10 శాతం వరకూ నష్ట పోయాయని పేర్కొన్నారు. అయితే, కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో మొండిబాకీల రికవరీ క్రమంగా మెరుగుపడుతోందని మిశ్రా చెప్పారు. 30 రోజులకు పైబడిన బకాయిలు .. సెకండ్‌ వేవ్‌ కారణంగా గతేడాది మధ్యలో 22 శాతానికి ఎగియగా ఈ ఏడాది జూలైలో 10-11 శాతానికి దిగివచ్చాయని వివరించారు.     

మరిన్ని వార్తలు