అరబిందో లాభం రూ.770 కోట్లు

13 Aug, 2021 01:15 IST|Sakshi

టర్నోవర్‌ రూ.5,702 కోట్లకు చేరిక

మధ్యంతర డివిడెండ్‌ 150 శాతం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషధ రంగ సంస్థ అరబిందో ఫార్మా జూన్‌ త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాలు మెరుగ్గా ప్రకటించింది. నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.9 శాతం ఎగసి రూ.770 కోట్లు సాధించింది. టర్నోవర్‌ రూ.5,540 కోట్ల నుంచి రూ.5,702 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో నాట్రోల్‌ను మినహాయించారు. యూఎస్‌ ఫార్ములేషన్స్‌ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే స్థిరంగా ఉండి రూ.2,681 కోట్లు సాధించింది. యూరప్‌ ఫార్ములేషన్స్‌ ఆదాయం 19.7 శాతం వృద్ధితో రూ.1,583 కోట్లు నమోదు చేసింది. ఏపీఐల ఆదాయం రూ.780 కోట్ల నుంచి రూ.812 కోట్లకు చేరింది.  

ఆదాయంలో 6.3 శాతం..
పరిశోధన, అభివృద్ధికి రూ.358 కోట్లు వెచ్చించారు. ఆదాయంలో ఇది 6.3 శాతం. మూడు ఇంజెక్టేబుల్స్‌తో కలిపి నాలుగు ఏఎన్‌డీఏలకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి తుది అనుమతి లభించింది. 2021–22 ఏడాదికి రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.1.50 మధ్యంతర డివిడెండ్‌ చెల్లింపునకు బోర్డు సమ్మతించింది. సవాళ్లతో కూడిన ప్రస్తుత సమయంలో త్రైమాసిక పనితీరు సంస్థ స్థితిస్థాపకతను ప్రతిబింబిస్తుందని అరబిందో ఫార్మా ఎండీ ఎన్‌.గోవిందరాజన్‌ ఈ సందర్భంగా తెలిపారు.

పశువులకు సంబంధించి జనరిక్‌ ఔషధాల అభివృద్ధి, కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌ సర్వీసులు అందిస్తున్న హైదరాబాద్‌ కంపెనీ క్రోనస్‌ ఫార్మా స్పెషాలిటీస్‌ ఇండియాలో అరబిందో 51% మెజారిటీ వాటా కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ రూ.420 కోట్లు. అలాగే అనుబంధ కంపెనీలైన ఆరోనెక్సŠట్‌ ఫార్మా, ఎమ్వియెస్‌ ఫార్మా వెంచర్స్‌ను అరబిందో ఫార్మాలో విలీనం చేయనున్నట్టు ప్రకటించింది.

అరబిందో షేరు ధర గురువారం 3.64 శాతం తగ్గి రూ.825.70 వద్ద స్థిరపడింది.  

మరిన్ని వార్తలు