ఐపీవోకు బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌

23 Sep, 2021 02:07 IST|Sakshi

డేటా ప్యాటర్న్స్‌ సైతం.. 

సెబీకి ప్రాస్పెక్టస్‌ దాఖలు

న్యూఢిల్లీ: కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్‌ మరో రెండు ఇష్యూలతో సందడి చేయనుంది. తాజాగా రెండు కంపెనీలు ఐపీవో బాట పట్టాయి. క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. జాబితాలో హైదరాబాద్‌ కేంద్రంగా మన్నికైన వినియోగ వస్తువులు, ఎలక్ట్రానిక్స్‌ విక్రయించే ‘బజాజ్‌ ఎల్రక్టానిక్స్‌’తోపాటు.. రక్షణ రంగ పీఎస్‌యూలకు ఎల్రక్టానిక్స్‌ పరికరాలు సరఫరా చేసే డేటా ప్యాటర్న్స్‌ చేరింది. వివరాలు చూద్దాం..

ఎల్రక్టానిక్స్‌ మార్ట్‌ ఇండియా
కన్జూమర్‌ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్‌ రిటైల్‌ చైన్‌.. ఎల్రక్టానిక్స్‌ మార్ట్‌ ఇండియా(ఈఎంఐఎల్‌) పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 500 కోట్లు సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. బజాజ్‌ ఎలక్ట్రానిక్స్, కిచెన్‌ స్టోర్లను నిర్వహించే ఈ కంపెనీ ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ నిధులలో రూ. 134 కోట్లు విస్తరణ వ్యయాలకు, రూ. 200 కోట్లు పెట్టుబడి అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. మరో రూ. 50 కోట్లను రుణ చెల్లింపులుకు వెచి్చంచనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించనుంది.

పవన్‌ కుమార్‌ బజాజ్, కరణ్‌ బజాజ్‌ ఏర్పాటు చేసిన ఈఎంఐఎల్‌ తెలుగు రాష్ట్రాలలో వేగంగా వృద్ధి చెందుతోంది. కోటి కస్టమర్లతోపాటు.. 7.5 లక్షల చదరపు అడుగుల రిటైల్‌ స్పేస్‌ను కలిగి ఉంది. 2,600 మంది నిపుణులతో 90 స్టోర్లను నిర్వహిస్తోంది. కంపెనీ ఆడియో అండ్‌ బియాండ్‌ పేరుతో మరో ప్రత్యేకత కలిగిన స్టోర్ల ఏర్పాటు సన్నాహాల్లో ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మరిన్ని స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఈఎంఐఎల్‌ తెలియజేసింది. అంతేకాకుండా ఢిల్లీలోనూ ప్రవేశించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది.    

డేటా ప్యాటర్న్స్‌..
రక్షణ, వైమానిక రంగాలలో వినియోగించే ఎల్రక్టానిక్‌ వ్యవస్థలను సరఫరా చేసే డేటా ప్యాటర్న్స్‌ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 600–700 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు, వాటాదారులు మరో 60,70,675 షేర్లను సైతం విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్‌ క్యాపిటల్, కార్పొరేట్‌ అవసరాలు, విస్తరణ తదితరాలకు వినియోగించనుంది. చెన్నై కంపెనీ డేటా ప్యాటర్న్స్‌ ప్రధానంగా రాడార్లు, నీటిఅడుగున పనిచేసే కమ్యూనికేషన్, ఏవియానిక్స్‌ తదితర పలు పరికరాలను రూపొందిస్తోంది. తొలి నానో శాటిలైల్‌ నియుశాట్‌ను అభివృద్ధి చేసింది.

హరిఓం పైప్‌ ఇండస్ట్రీస్‌
స్టీల్‌ ఉత్పత్తుల తయారీలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ హరిఓం పైప్‌ ఇండస్ట్రీస్‌ ఐపీవోకు రానుంది. సెబీ వద్ద ఈ మేరకు పత్రాలను దాఖలు చేసింది. ఇష్యూ ద్వారా రూ.100–120 కోట్లను సమీకరిస్తారు. 85 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయిస్తారు. ప్రారంభ వాటా అమ్మకం ద్వారా వచ్చే మొత్తాన్ని మూలధన  అవసరాలు, విస్తరణకు ఖర్చు చేస్తారు. గృహ, మౌలిక, వ్యవసాయం, వాహన, సౌర, ఫ్యాబ్రికేషన్, ఇంజనీరింగ్‌ రంగాలకు అవసరమైన స్టీల్‌ ఉత్పత్తులను కంపెనీ తయారు చేస్తోంది. తెలంగాణలోని సంగారెడ్డి వద్ద నూతన ప్లాంటును కంపెనీ స్థాపించనుంది.  2020–21లో రూ.255 కోట్ల టర్నోవర్‌పై రూ.15 కోట్ల నికరలాభం ఆర్జించింది.

మరిన్ని వార్తలు