యువకుల్లారా..రోజుకి 18గంటలు పనిచేయండి.. సీఈవో హితబోధపై నెటిజన్ల ఆగ్రహం!

30 Aug, 2022 18:12 IST|Sakshi

కొద్ది రోజుల క్రితం ముంచుకొస్తున్న ద్రవ్యోల్బణం కారణంగా ఖర్చుల్ని తగ్గించేందుకు ఓ సీఈవో తన సంస్థ ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించారు. పైగా ఉద్యోగుల్ని తొలగించడంపై మొసలి కన్నీరూ కారుస్తూ (నెటిజన్ల కామెంట్‌) ఉద్యోగుల క్షేమం కోరి తాను ఈ పోస్ట్‌ చేస్తున్నట్లు చెప్పారు. నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యారు. తాజాగా మరో సీఈవో ఉద్యోగులు రోజుకు 18 గంటలు పనిచేయాలంటూ లింక్డ్‌ఇన్‌లో పోస్ట్‌ చేయడం చర్చాంశనీయంగా మారింది

బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు శాంతను దేశ్‌పాండే అప్పుడే చదుపు పూర్తి చేసుకొని ఉద్యోగంలోకి అడుగుపెట్టిన యువకులు ఆఫీస్‌ వర్క్‌ను - లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేయాలనే కోరికతో కాకుండా రోజుకు 17-18 గంటలు పని చేయాలని సూచించారు.  

రోజుకు 18గంటలు 
లింక్డ్‌ ఇన్ పోస్ట్‌లో.. ఉద్యోగులు 22 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు..వారు కనీసం 4 నుంచి 5 ఏళ్ల పాటు ప్రతి రోజు 18గంటల పనులు చేయాలి. "బాగా తినండి, ఫిట్‌గా ఉండండి, కానీ 4 - 5ఏళ్ల పాటు రోజుకు 18గంటలు పని చేసేలా టార్గెట్‌ పెట్టుకోండని హితబోధ చేశారు. యువకులు ఇంటర్నెట్‌తో కాలం గడిపేస్తున్నారు. పని-జీవితంలో సమతుల్యత, కుటుంబంతో సమయం గడపడం ముఖ్యమని తమను తాము సమర్ధించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

క్రాష్ అండ్ బర్న్
ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు దేశ్‌ పాండేపై మండిపడ్డారు. కార్పొరేట్ ప్రపంచంలో అధిక అట్రిషన్ రేట్‌ (ఉద్యోగ వలసల)కు అతనిలాంటి వారే కారణమని కామెంట్‌ చేశారు. దేశ్‌పాండే, అతని వ్యాపారం "క్రాష్ అండ్ బర్న్"కి అర్హులని మరో నెటిజన్‌ తన కామెంట్లో పేర్కొన్నారు. "ఎందుకు 18గంటలు మాత్రమే పనిచేయాలి. 24 లేదా 48 గంటలు ఎందుకు పనిచేయకూడదని ఎద్దేశా చేశారు. ఇలా నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో రోజుకి 18 గంటలు పనిచేయడం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు