BSNL: అత్యంత చవకైన ఇంటర్నెట్‌ ప్లాన్‌..! కేవలం రూ.329తో 1000జీబీ డేటా..!

8 Mar, 2022 16:45 IST|Sakshi

BSNL: గత ఏడాది దిగ్గజ ప్రైవేట్‌ టెలికాం సంస్థలు పోటీ పడుతూ మొబైల్‌ ఇంటర్నెట్‌ ప్లాన్‌ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇదే అదునుగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌) సరికొత్త ప్లాన్లను ప్రకటిస్తూ కొత్త కస్టమర్లను యాడ్‌ చేసుకుంటుంది. తక్కువ ధరలో అధిక ప్రయోజనాలు యూజర్లకు కలిగే విధంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ పలు ప్లాన్స్‌ను ప్రకటించింది. తాజాగా బ్రాడ్‌ బ్యాండ్‌ యూజర్లను దృష్టిలో ఉంచుకొని బీఎస్‌ఎన్‌ఎల్‌ అత్యంత చవకైన ఇంటర్నెట్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేసింది. 

కేవలం రూ. 329తో 1 టీబీ డేటా..!
బీఎస్‌ఎన్‌ఎల్‌ తన బ్రాడ్‌ బ్యాండ్‌ కస్టమర్లకోసం సరికొత్త ఫైబర్ ఎంట్రీ ప్లాన్‌ రూ. 329ను ప్రకటించింది.ఈ  ప్లాన్‌ కాల పరిమితి నెలరోజులు. ఈ ప్లాన్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌  భారత్ ఫైబర్  ప్లాన్‌లో అత్యంత చౌకైన ప్లాన్‌గా నిలుస్తోంది.  ఈ ప్లాన్‌తో  1000జీబీ(1టీబీ) డేటా వరకు యూజర్లు గరిష్టంగా 20Mbps వేగాన్ని పొందవచ్చును. తరువాత నామమాత్రం స్పీడ్‌తో బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలను యూజర్లకు కల్పిస్తోంది బీఎస్‌ఎన్‌ఎల్‌. కాగా ఇది ప్రస్తుతం ఎంపిక చేసిన రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది. దీంతో పాటుగా ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు అదనంగా ఏ నెట్‌వర్క్‌కైనా లోకల్‌, STD కాలింగ్‌ను కూడా యాక్సెస్‌ను చేయవచ్చును.

ఫైబర్‌ ఎంట్రీ ప్లాన్‌తో పాటుగా పైబర్‌ ఎక్స్‌పీరియన్స్‌, ఫైబర్‌ బేసిక్‌, ఫైబర్‌ బేసిక్‌ ప్లస్‌ ప్లాన్స్‌ నెలకు రూ. 399 నుంచి రూ. 599 అందుబాటులో ఉన్నాయి. సదరు ప్లాన్స్‌పై అదనపు డేటాతో పాటుగా, పలు ఓటీటీ సర్వీసులను కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తోంది. 

బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్లే లక్ష్యంగా..!
బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్ల పెంపును లక్ష్యంగా చేసుకొని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ సరికొత్త భారత్‌ ఫైబర్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. దిగ్గజ ప్రైవేట్‌ టెలికాం సంస్థలకు ధీటుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ కొత్త ప్లాన్లను ప్రకటించింది. బ్రాడ్‌ బ్యాండ్‌ ఇంటర్నెట్‌ విషయంలో ప్రైవేట్‌ టెలికాం సంస్థలు  జియో, ఎయిర్‌టెల్‌ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ గట్టిపోటీను  ఎదుర్కొంటుంది.   

చదవండి: క్రేజీ ఆఫర్‌..! పలు మహీంద్రా కార్లపై రూ. 3 లక్షల వరకు భారీ తగ్గింపు..!

మరిన్ని వార్తలు