చైనాకు గట్టి షాక్!.. కీలక స్కీమ్‌కు కేంద్రం ఆమోదం

15 Dec, 2021 18:08 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా సెమీకండెక్టర్లు, డిస్‌ప్లే తయారీకి రూ.76 వేల కోట్ల విలువైన ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్‌ఐ) పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రి వర్గం పచ్చజెండా ఊపినట్లు అనురాగ్ ఠాకూర్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. భారతదేశాన్ని ఎలక్ట్రానిక్స్ కేంద్రంగా మార్చే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద వచ్చే 6 ఏళ్లలో రూ.76,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. భారత్‌లో సెమీకండెక్టర్ల తయారీకి అవసరమైన వ్యస్థలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పలు రకాల రాయితీలను ఇవ్వనున్నట్లు టెలికాం & ఐటీ మంత్రి అశ్వినీ వైష్నావ్ తెలిపారు.

సెమీకండెక్టర్‌ వేఫర్‌ ఫ్యాబ్రికేషన్‌ యూనిట్‌ ఏర్పాటుకు అయ్యే మూలధన వ్యయంలో 25శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. అదే విధంగా అసెంబ్లింగ్‌, ప్యాకింగ్‌,టెస్టింగ్‌, చిప్‌ డిజైన్‌ వంటి వాటికి ఇటువంటి రాయితీలనే ఇవ్వనున్నారు. కేంద్రం ఈ తీసుకున్న నిర్ణయంతో సెమీకండెక్టర్ల తయారీలో అగ్రగామిగా ఉన్న చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు. కేంద్రా క్యాబినెట్‌ ఆమోదం తెలపడంతో త్వరలో పాలసీ విధి విధానాలను పూర్తి స్థాయిలో రూపొందించడం, ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తిగా ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించడం మొదలైన ప్రక్రియను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ) ప్రారంభించనుంది. 

(చదవండి: రూపే డెబిట్ కార్డు, భీమ్ యూపీఐ యూజర్లకు కేంద్రం తీపికబురు!)

ఉత్పాదన ఆధారిత ప్రోత్సాహక(పీఎల్‌ఐ) పథకాల ద్వారా దేశీయంగా తయారీ, ఎగుమతుల పరిధిని కేంద్రం గణనీయంగా విస్తరించింది. తాజా సెమీకండక్టర్‌ విధానంతో దేశీయంగా తయారీ కార్యకలాపాలు మరింతగా పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ముందుగా డిస్‌ప్లేల కోసం ఒకటి లేదా రెండు ఫ్యాబ్‌ యూనిట్లు, అలాగే విడిభాగాల డిజైనింగ్‌..తయారీ కోసం 10 యూనిట్లు ఏర్పాటవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వివరించాయి.  

అన్నింటికీ కీలకంగా చిప్‌.. 
మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ మొదలుకుని ఆటోమొబైల్స్‌ దాకా అనేక ఉత్పత్తుల్లో సెమీ కండక్టర్లు(చిప్‌) కీలకంగా ఉంటున్నాయి. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌బడ్స్, వాషింగ్‌ మెషీన్ల వంటి అనేక ఉత్పత్తుల్లో వీటిని వినియోగిస్తున్నారు. సాధారణంగా శాంసంగ్, ఎన్‌ఎక్స్‌పీ, క్వాల్‌కామ్‌ వంటి చిప్‌ తయారీ సంస్థల కోసం తైవానీస్‌ సెమీకండక్టర్‌ మాన్యుఫాక్చరింగ్‌ కార్పొరేషన్‌(టీఎంఎస్‌సీ)లాంటి కంపెనీలు వీటిని ఉత్పత్తి చేస్తున్నాయి. ఇలా తయారైన చిప్‌లను ఆయా కంపెనీలు పరీక్షించి, ప్యాకేజ్‌గా చేసి.. సిస్కో, షావొమీ వంటి పరికరాల ఉత్పత్తి కంపెనీలకు విక్రయిస్తున్నాయి. చిప్‌ల తయారీ ప్లాంట్లను ఫ్యాబ్స్‌ లేదా ఫౌండ్రీలుగా వ్యవహరిస్తారు.

(చదవండి: సర్వీసు చార్జీల పేరుతో ఎస్‌బీఐ భారీగా వడ్డీంపు..!)

మరిన్ని వార్తలు