రిలయన్స్ రిటైల్‌లో కార్లయిల్‌కు వాటా!

14 Sep, 2020 11:29 IST|Sakshi

పీఈ దిగ్గజం కార్లయిల్‌ గ్రూప్‌ చర్చల్లో?

2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడుల యోచన

సరికొత్త గరిష్టాన్ని అందుకున్న ఆర్‌ఐఎల్‌

రూ. 16.5 లక్షల కోట్లను తాకిన మార్కెట్‌ విలువ

డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ విభాగం రిలయన్స్‌ రిటైల్‌లో మరో పీఈ దిగ్గజం కార్లయిల్‌ గ్రూప్‌ వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా రిలయన్స్‌ రిటైల్‌లో 150-200 కోట్ల డాలర్ల(సుమారు రూ. 14,700 కోట్లు) వరకూ కార్లయిల్‌ గ్రూప్‌ ఇన్వెస్ట్‌ చేయవచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు రెండు కంపెనీల మధ్య చర్చలు నడుస్తున్నట్లు విశ్లేషకులు ఊహిస్తున్నారు. అయితే ఈ అంశంపై అటు ఆర్‌ఐఎల్‌, ఇటు కార్లయిల్‌ గ్రూప్‌ ప్రతినిధులు స్పందించలేదంటూ ఈ వార్తల విశ్లేషణ సందర్భంగా ఆంగ్ల మీడియా పేర్కొంది. కాగా, ఈ డీల్‌ కుదిరితే.. దేశీ కంపెనీలో కార్లయిల్‌ చేస్తున్న అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్‌గా నిలవనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా దేశీ రిటైల్‌ రంగ కంపెనీలో కార్లయిల్‌ తొలిసారి వాటా సొంతం చేసుకున్నట్లు అవుతుందని తెలియజేశారు. కాగా.. ఇటీవల రిలయన్స్‌ రిటైల్‌లో 1.75 శాతం వాటా కొనుగోలుకి పీఈ సంస్థ సిల్వర్‌ లేక్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం విదితమే. ఇందుకు రూ. 7,500 కోట్లు వెచ్చించనుంది. తద్వారా రిలయన్స్‌ రిటైల్‌ విలువ రూ. 4.21 లక్షల కోట్లకు చేరినట్లు మార్కెట్‌వర్గాలు అంచనా వేశాయి కూడా! 

షేరు జోరు
డిజిటల్‌ విభాగం జియో బాటలో రిలయన్స్‌ రిటైల్‌లోనూ వాటా విక్రయం ద్వారా భారీగా నిధుల సమీకరణ చేపట్టనున్న వార్తలతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌కు మరోసారి డిమాండ్ పుట్టింది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఆర్‌ఐఎల్‌ షేరు 2 శాతం ఎగసి రూ. 2,360ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 0.7 శాతం లాభపడి రూ. 2,335 వద్ద ట్రేడవుతోంది.  మరోపక్క ఆర్‌ఐఎల్‌ పీపీ షేరు సైతం 3 శాతం పుంజుకుని రూ. 1462కు చేరింది. దీంతో ఉదయం సెషన్‌లో కంపెనీ మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ) రూ. 16.5 లక్షల కోట్లను తాకింది. వారాంతాన ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ క్యాప్‌ తొలిసారి రూ. 15 లక్షల కోట్లు(200 బిలియన్‌ డాలర్లు)ను అధిగమించడం ద్వారా దేశీ స్టాక్‌ మార్కెట్ల చరిత్రలో కొత్త రికార్డును లిఖించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు