ఆన్‌లైన్‌లో ప్రెషర్ కుక్కర్ కొంటున్నారా?.. అయితే, జర జాగ్రత్త!

29 Dec, 2021 19:07 IST|Sakshi

మీరు ఆన్‌లైన్‌లో కొత్త ప్రెషర్ కుక్కర్ కొనాలని చూస్తున్నారా? అయితే, జాగ్రత్త. బిఐఎస్ ప్రమాణాలను ఉల్లంఘించే ఈ-కామర్స్ కంపెనీలకు, అమ్మకందారులకు సీసీపీఏ తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వాటిలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇతర సంస్థలు కూడా ఉన్నాయి. బిఐఎస్ ప్రమాణాలను ఉల్లంఘించే గృహోపకరణ వస్తువులను వినియోగదారులను కొనుగోలు చేయకుండా ఉండటానికి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) భద్రతా నోటీసులు జారీ చేసింది.

వినియోగదారుల రక్షణ చట్టం, 2019లోని సెక్షన్ 18(2)(జె) కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. బిఐఎస్ ప్రమాణాలను ఉల్లంఘించి ప్రెషర్ కుక్కర్లను విక్రయిస్తున్నట్లు గుర్తించిన ఈ కామర్స్ సంస్థలు, అమ్మకందారులపై సుమోటోగా చర్యలు తీసుకుంది. ఇటువంటి ఉల్లంఘనలకు Pressure Cookersసంబంధించి ఇప్పటికే 15 సార్లు నోటీసులు జారీ చేసినట్లు ఒక ప్రభుత్వ ప్రకటనలో తెలిపింది. దేశీయ ప్రెషర్ కుక్కర్ల అమ్మకందారులు క్యూసీఓ(క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్) నిబందనలు ఉల్లంఘించినందుకు ఈ -కామర్స్ సంస్థలపై 3 సార్లు, హెల్మెట్ల విక్రయం విషయంలో 2 సార్లు నోటీసులు జారీ చేసినట్లు సీసీపీఏ తెలిపింది.

ప్రమాదాల భారీ నుంచి వినియోగదారులను రక్షించడానికి ఈ చర్య తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. క్యూసీఓ ఆర్డర్ ప్రకారం దేశీయ ప్రెషర్ కుక్కర్‌లు ఇండియన్ స్టాండర్డ్ ఐఎస్ IS 2347:2017కి అనుగుణంగా ఉండాలి. 1 ఆగస్ట్ 2020 నుంచి అమలులోకి వచ్చే బిఐఎస్ నుంచి లైసెన్స్ కింద స్టాండర్డ్ మార్క్‌ను కలిగి ఉండటం తప్పనిసరి. క్యూసీఓ పేర్కొన్న ప్రమాణాలను ఉల్లంఘించడం అంటే ప్రజా భద్రతకు ప్రమాదం కలిగించడమే కాకుండా, వినియోగదారులను తీవ్రమైన గాయాలకు గురిచేస్తుందని సీసీపీఏ తెలిపింది.

గృహోపకరణాల విషయంలో కుటుంబ సభ్యులు అటువంటి వస్తువులకు సమీపంలో ఉంటారు. కాబట్టి, వారికి ఏదైనా ప్రమాదం కలిగే అవకాశం ఎక్కువ. క్యూసీఓ ప్రమాణాలను ఉల్లంఘించే హెల్మెట్, ప్రెషర్ కుక్కర్లు, వంట గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేయకుండా వినియోగదారులు ఉండటానికి డిసెంబర్ 6న సీసీపీఏ దేశవ్యాప్తంగా ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ విషయంలో వినియోగదారుల హక్కుల ఉల్లంఘనను పరిశోధించడానికి సీసీపీఏ ఇప్పటికే దేశవ్యాప్తంగా జిల్లా మేజిస్ట్రేట్‌లకు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.

(చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గుడ్‌న్యూస్‌..!)

మరిన్ని వార్తలు