ఆల్‌ టైం రికార్డ్‌, దేశంలో భారీగా పెరగనున్న సిమెంట్‌ ధరలు : క్రిసిల్‌

3 Dec, 2021 16:00 IST|Sakshi

కరోనా సంక్షోభంతో కుదేలైన రియల్‌ ఎస్టేట్‌ రంగానికి మరో ఎదురు దెబ్బ తగలనుంది. దేశంలో సిమెంట్‌ ధరలు భారీగా పెరగనున్నట్లు దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ తెలిపింది. ఈ ఏడాది ఆగస్ట్‌ నెలలో రీటైల్‌ మార్కెట్‌లో సిమెంట్‌ బస్తా ధర రూ.10 నుంచి 15కి పెరిగింది. ఇప్పుడు అదే సిమెంట్‌ ధర రూ.15 నుంచి రూ.20లకు పెరిగి రానున్న రోజుల్లో సిమెంట్‌ ధర రూ.400తో ఆల్‌ టైమ్‌ హై రికార్డ్‌కు చేరుకోనున్నట్లు  క్రిసిల్‌ రేటింగ్స్‌ తాజా నివేదిక తెలిపింది. అయితే సిమెంట్‌ ధరలు పెరగడానికి కారణం దేశంలో బొగ్గు, డీజిల్‌ ధరలు పెరగడమే కారణమని క్రిసిల్‌ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 

నిర్మాణ రంగంపై భారం
వాస్తవానికి ఈ ఆర్ధిక సంవత్సరంలో సిమెంట్‌ అమ్మకాలు 11-13 శాతం పెరిగినట్లు క్రిసిల్‌ అంచనా వేసింది. అయితే గత ఆర్థిక సంవత్సరం కరోనా లాక్‌డౌన్ల నేపథ్యంలో పరిశ్రమ దీన్ని వృద్ధిగా భావించట్లేదు. ఈ క్రమంలో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో డిమాండ్‌ పెరిగితే గానీ తమకు లాభాలు వచ్చే పరిస్థితి లేదని, మార్కెట్‌లో 75శాతం వాటా ఉన్నా 17 సిమెంట్‌ కంపెనీ ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు క్రిసిల్‌ తెలిపింది. 

సిమెంట్‌ ధరలు ఎలా ఉన్నాయి
దేశంలోనే సిమెంట్‌ ధరలు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంట్‌ బస్తా ధర రూ.54పెరిగింది.సెంట్రల్‌ రీజియన్‌లో రూ.20 పెరిగితే, ఉత్తరాది రాష్ర్టాల్లో రూ.12, పశ్చిమాది ప్రాంతాల్లో రూ.10, తూర్పు నగరాల్లో రూ.5 మేర పెరిగింది. ఆయా కంపెనీలను బట్టి మార్కెట్‌లో బస్తా ధర రూ.350 నుంచి రూ.400 పలుకుతుండగా.. ఈ క్రమంలో సిమెంట్‌  ధరలు మునుపెన్నడూ లేని రికార్డు స్థాయికి చేర్చగలవన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు