ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త.. రూ.60 వేల కోట్లతో కొత్త పథకం!

25 Sep, 2023 21:50 IST|Sakshi

పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న పేదలకు శుభవార్త ఇది. పట్టణాల్లో చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న పేదలకు తక్కువ (సబ్సిడీ) వడ్డీ రేట్లలో గృహ రుణాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 60,000 కోట్లు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. పట్టణ ప్రాంతాల్లోని అల్పాదాయ వర్గానికి చెందిన 20.5 లక్షల మంది రుణ దరఖాస్తుదారులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా.

రాయిటర్స్ కథనం ప్రకారం..  వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు, కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో  ఈ పథకాన్ని రాబోయే నెలల్లో అమలు చేయనున్నారు. ఈ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునే పేదలకు రూ.9 లక్షలు రుణం అందిస్తారు. దీనిపై కేవలం 3 నుంచి 6.5 శాతం వడ్డీ మాత్రమే ఉంటుంది. ఒక వేళ ఇంతకు ముందే హోమ్‌లోన్‌ తీసుకున్నట్లయితే 20 సంవత్సరాల టెన్యూర్‌తో రూ.50 లక్షల లోపు గృహ రుణాలు తీసుకున్నవారు మాత్రమే ఈ వడ్డీ సబ్సిడీకి అర్హులు.

వడ్డీ రాయితీని ముందుగానే లబ్ధిదారుల హౌసింగ్ లోన్ ఖాతాలో జమ చేస్తారు. 2028 వరకు ప్రతిపాదించిన పథకం దాదాపు ఖరారైందని,  కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలను రాయిటర్స్ ఉటంకిస్తూ పేర్కొంది.

స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రకటించారు. "రాబోయే సంవత్సరాల్లో కొత్త పథకాన్ని తీసుకువస్తాం. ఇది ప్రాంతాల్లోని అద్దె ఇళ్లల్లో, మురికివాడల్లో, అనధికార కాలనీలలో నివసిస్తున్న కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది" అని మోదీ చెప్పారు.

మరిన్ని వార్తలు