అంతరిక్ష ప్రయోగాల్లో చైనా దూకుడు

7 Nov, 2021 19:34 IST|Sakshi

బీజింగ్: అంతరిక్ష ప్రయోగాల్లో చైనా తన దూకుడు తనాన్ని కొనసాగిస్తూనే ఉంది. నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌లోని క్సిచాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి చైనా నవంబర్ 6న 3 కొత్త రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించినట్లు అధికారిక మీడియా తెలిపింది. యోగన్-35 విభాగానికి చెందిన ఈ ఉపగ్రహాలను లాంగ్ మార్చి-2డి క్యారియర్ రాకెట్ కక్ష్యలోకి విజయవంతంగా ప్రయోగించినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. ఈ లాంగ్ మార్చ్ సిరీస్ రాకెట్స్ ద్వారా చేపట్టిన 396వ మిషన్​గా ఈ ప్రయోగం నిలిచింది. 

2019 మార్చిలో లాంగ్ మార్చి 3బీ రాకెట్ విజయవంతం కావడంతో చైనా విజయవంతంగా పూర్తి చేసిన 300వ ప్రయోగంగా అది నిలిచింది. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన లాంగ్ మార్చ్ క్యారియర్ రాకెట్ సిరీస్ చేపట్టిన అంతరిక్ష ప్రయోగాలు 96.4 శాతం సక్సెస్ అయ్యాయి. లాంగ్ మార్చ్ రాకెట్ మొదటి 100 ప్రయోగాలను పూర్తి చేయడానికి 37 సంవత్సరాలు పడితే, 200 ప్రయోగాలను పూర్తి చేయడానికి 7.5 సంవత్సరాలు, చివరి 300ను చేరుకోవడానికి కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే పట్టింది. సంవత్సరానికి సగటు ప్రయోగాల సంఖ్య 2.7 నుంచి 13.3కు, తర్వాత 23.5కు పెరిగింది.

(చదవండి: ఈ కారును ఏడాదికి రెండు సార్లు ఛార్జ్ చేస్తే చాలు!)

మరిన్ని వార్తలు