ఆదాయమే కాదు అప్పు కూడా లక్షల కోట్లు.. అగ్రగామిగా అంబానీ కంపెనీ!

25 Nov, 2023 15:12 IST|Sakshi

భారతదేశంలో అత్యంత సంపన్నుడు ఎవరంటే ముక్తకంఠంతో 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) అని చెబుతారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ నడుపుతూ లక్షల కోట్లు ఆర్జిస్తున్న ఈయన.. అప్పుల్లో కూడా అగ్రగామిగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో చూసేద్దాం..

👉ఏస్ ఈక్విటీ డేటా ప్రకారం.. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా రూ. 3.13 లక్షల కోట్లు అప్పు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎక్కువ అప్పు చేసిన కంపెనీల జాబితాలో రిలయన్స్ ప్రధమ స్థానంలో ఉన్నట్లు సమాచారం.

👉దేశంలోని పెద్ద విద్యుత్ రంగ కంపెనీలలో ఒకటైన 'నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్' (NTPC) రూ. 2.20 లక్షల కోట్ల అప్పుతో ఈ జాబితాలో రెండవ స్థానంలో చేరింది.

👉వోడాఫోన్ ఐడియా అప్పుల గురించి గత కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే దీని అప్పు రిలయన్స్ కంటే తక్కువని తెలుస్తోంది. ఈ కంపెనీ ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నప్పటికీ అప్పు మాత్రం రూ. 2.01 లక్షల కోట్లని సమాచారం. 

👉భారతి ఎయిర్‌టెల్ కూడా దేశంలో ఎక్కువ అప్పు తీసుకున్న కంపెనీలలో ఒకటిగా ఉంది. ఈ సంస్థ మొత్తం అప్పు రూ.1.65 లక్షల కోట్లని తెలుస్తోంది.

👉దేశంలోనే అతిపెద్ద చమురు సంస్థ 'ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్' (IOCL) రూ.1.40 లక్షల కోట్ల అప్పులను, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ రూ.1.29 లక్షల కోట్ల అప్పుతో ఈ జాబితాలో చేరాయి. 

👉పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (PGCIL) అప్పు రూ. 1.26 లక్షల కోట్లు కాగా, దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ అప్పుడు రూ. 1.25 లక్షల కోట్ల వరకు ఉందని స్పష్టమవుతోంది. 

👉చంద్రయాన్ మిషన్‌లో కీలక పాత్ర పోషించిన 'లార్సెన్ అండ్ టుబ్రో' (Larsen & Toubro) సంస్థ మొత్తం అప్పు రూ.1.18 లక్షల కోట్లు. లక్ష కోట్ల కంటే ఎక్కువ అప్పు చేసిన కంపెనీల జాబితాలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కూడా ఉంది. ఈ కంపెనీ ప్రస్తుత అప్పు రూ.1.01 లక్షల కోట్లు. అయితే ఎక్కువ అప్పు చేసిన కంపెనీల జాబితాలో అదానీ గ్రూప్ లేకపోవడం గమనార్హం.

నిజానికి ఏదైనా ఒక కంపెనీ ఎదిగే సయమంలో నిధుల సమీకరణ చాలా అవసరం. ఇందులో భాగంగానే ప్రముఖ సంస్థలు నిధులు సమీకరిస్తాయి. కేవలం భారతీయ కంపెనీలు మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా పెద్ద సంస్థలు ఇదే విధానాలతో ముందుకు సాగుతూ దినిదినాభివృద్ది చెందుతున్నాయి.

మరిన్ని వార్తలు