సబ్సీడీలపై కొత్త మార్గదర్శకాలు!

16 Sep, 2022 11:09 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌ఈ)లు ఇకపై అనుబంధ సంస్థలలో వాటా విక్రయించాలంటే తాజా మార్గదర్శకాలను పాటించవలసి ఉంటుంది. పెట్టుబడులు, పబ్లిక్‌ ఆస్తుల నిర్వహణ సంస్థ(దీపమ్‌) ఇందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం విక్రయ ప్రతిపాదనలను సంబంధిత పాలనా(ఎడ్మినిస్ట్రేటివ్‌) శాఖలకు పీఎస్‌ఈలు దాఖలు చేయవలసి ఉంటుంది. ఇప్పటివరకూ అనుబంధ సంస్థలలో మెజారిటీ లేదా మైనారిటీ వాటాలు, యూనిట్ల విక్రయాలను దీపమ్‌ చేపడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. 

సబ్సిడరీలలో వాటాల విక్రయంపై పీఎస్‌ఈలు నిర్ణయం తీసుకునేందుకు ఈ ఏడాది జూన్‌లో క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఈ బాటలో అనుబంధ సంస్థలకు చెందిన వ్యూహాత్మక వాటాలు, యూనిట్లు, భాగస్వామ్య సంస్థల విక్రయానికి దీపమ్‌ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. వెరసి ఇకపై  పీఎస్‌ఈ మాతృ సంస్థల బోర్డులు వ్యూహాత్మక విక్రయ ప్రతిపాదనలను సంబంధిత పాలనా శాఖలకు పంపించవలసి ఉంటుంది. వీటిని పరిశీలించిన ఆయా శాఖలు తదుపరి దీపమ్‌కు నివేదిస్తాయి.

 కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన డిజిన్వెస్ట్‌మెంట్‌పై ఏర్పాటయ్యే ఆల్టర్నేటివ్‌ మెకనిజం నుంచి ఈ ప్రతిపాదనలకు ముందస్తు అనుమతిని దీపమ్‌ పొందుతుంది. ఈ నిర్ణయాలను పీఎస్‌ఈలకు తెలియజేస్తారు. వెరసి మాతృ సంస్థ బోర్డులు ఈ లావాదేవీలను చేపట్టేందుకు వీలుంటుంది. 

 

మరిన్ని వార్తలు