అలెర్ట్‌: ఈపీఎఫ్ అకౌంట్‌లో మీ వడ్డీ డబ్బులు కనిపించడం లేదా?

6 Oct, 2022 13:41 IST|Sakshi

ఎంప్లాయి ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఈపీఎఫ్‌ఓ) ఖాతాదారులకు అలెర్ట్‌. మీ ఈపీఎఫ్‌ఓ ఖాతాలో వడ్డీ మొత్తం కనిపించడంలేదని కంగారు పడుతున్నారా? సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ కారణంగా ఈ వడ్డీ మొత్తం స్టేట్‌మెంట్‌లో కనిపించడం లేదని కేంద్ర ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది.  

ఈపీఎఫ్‌ఓ సంస్థ ప్రతి ఆర్ధిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు వడ్డీ ఎంత చెల్లించేది నిర్ణయిస్తుంది. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత సంబంధిత ఖాతాలో  ఆ వడ్డీని జమ చేస్తుంది.  

ఎప్పటిలాగే 2020-2021 ఆర్ధిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీని చెల్లించినట్లు మార్చి 2021లో  ప్రకటించింది. అదే ఏడాది డిసెంబర్‌ నెలలో లబ్ధి దారుల అకౌంట్‌లలో డిపాజిట్‌ అయ్యింది.  2021-22 సంబంధించి ఈపీఎఫ్‌ బోర్డు వడ్డీ రేటును 8.1 శాతంగా నిర్ణయించింది. కానీ ఇప్పటి వరకు అకౌంట్‌లో జమ కాలేదు. 

దీంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోర్డు సభ్యులు నిర్ణయించిన వడ్డీ మొత్తం ఇప్పటి వరకు తమ అకౌంట్‌లలో జమ కాలేదంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ మాజీ డైరెక్టర్‌ మోహన్‌దాస్‌ పాయ్‌ పీఎఫ్‌ వడ్డీ ఎక్కడ? అంటూ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌పై ఆర్థిక మంత్రిత్వ శాఖ..పీఎఫ్‌ ఖాతాలో రూ.2.5 లక్షల మించి జమ చేస్తే..ఆ మొత్తంపై లభించే వడ్డీకి పన్ను విధిస్తామని గతంలో పేర్కొన్నాం. దానికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడేషన్‌ జరుగుతుండటంతో ఆలస్యం అవుతోందని, వడ్డీ మొత్తాన్ని ఏ ఒక్క చందాదారుడూ కోల్పోరని తన ట్వీట్‌లో స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు