ఫేస్‌బుక్ లో మరో లోపం

20 Dec, 2020 14:13 IST|Sakshi

ఫేస్‌బుక్ లో కొత్త సమస్య.. ఖాతా వివరాలన్నీ బయటకి

ఫేస్‌బుక్ లో మరో బగ్ బయటపడింది. ఈ బగ్ ద్వారా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల వ్యక్తిగత ఈ-మెయిల్, చిరునామా, పుట్టినరోజుల వివరాలు బహిర్గతం అవుతునట్లు ఇటీవల ఒక భద్రతా పరిశోధకుడు సౌగత్ పోఖారెల్ తెలిపారు. సాదారణంగా మనం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కోసం సైన్ అప్ చేసినప్పుడు వినియోగదారుల ఇమెయిల్, చిరునామా, పుట్టినరోజులు వివరాలు వెల్లడిస్తాం. అయితే ఈ బగ్ కారణంగా వినియోగదారుల సున్నితమైన సమాచారం లీక్ అవుతుందని పరిశోదకులు చెబుతున్నారు. ఈ సమాచారంతో సైబర్ నెరగాళ్లు దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.(చదవండి: యూజర్లకు షాక్‌ ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌)

పోఖరెల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫేస్‌బుక్ కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్ ని పరీక్షిస్తున్న సమయంలో ఈ బగ్ గుర్తించినట్లు తెలిపారు. కొన్ని బిజినెస్ అకౌంట్ల కోసం తీసుకొస్తున్న ఫీచర్ పరీక్ష దశలో భాగంగా తీసుకొచ్చిన ఫేస్‌బుక్ బిజినెస్ సూట్ టూల్ కారణంగా ఇలా జరుగుతుందట. ఈ సమస్య గురుంచి ఫేస్‌బుక్ ప్రతినిది మాట్లాడుతూ.. "బిజినెస్ అకౌంట్ల కోసం చేసిన పరీక్ష దశలో భాగంగా పరిశోధకుడు పోఖరెల్ ఈ సమస్యను కనుగొన్నారు. బిజినెస్ అకౌంట్ల కోసం అక్టోబర్ లో నిర్వహించిన ఒక చిన్న పరీక్షలో వినియోగదారులు షేర్ చేసిన మెసేజ్ ఇతర వివరాలు బయటకి వచ్చాయి. అయితే వెంటనే గుర్తించి సమస్యను పరిష్కరించాం. ఈ బగ్ ను కనుగొన్న పరిశోదకుడికి మా బగ్ బౌంటీ ప్రోగ్రాం కింద బహుమతి కూడా ఇచ్చాం" అని చెప్పారు. 

మరిన్ని వార్తలు