70 నగరాలకు గ్రాసరీ: ఫ్లిప్‌కార్ట్‌ 

3 Mar, 2021 10:49 IST|Sakshi

 మరిన్ని నగరాలకు  ఆన్‌లైన్ గ్రాసరీ ‌ సేవలు

 రాబోయే ఆరునెలల్లో 70కి పైగా నగరాలకు ఈ గ్రాసరీ

సాక్షి, ముంబై:  గ్లోబల్‌ రీటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్‌  దేశీయంగా కిరాణా సేవల్లో మరింత  దూసుకుపోవాలని చూస్తోంది. ఈ క్రమంలో రానున్న ఆరు నెలల్లో 70కి పైగా నగరాలకు తన గ్రాసరీ సేవలను విస్తరించనున్నామని ప్రకటించింది.  ఆగస్టు నాటికి గ్రాసరీ సర్వీస్‌ను మరో 20 కిపైగా నగరాలకు  పెంచాలని భావిస్తున్నట్టు  ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌  తెలిపింది. దేశవ్యాప్తంగాప్రస్తుతం 50 నగరాల్లో ఈ సేవలను కంపెనీ అందిస్తోంది. కోల్‌కతా, పూణే ,అహ్మదాబాద్ వంటి మెట్రో నగరాలతోపాటు, మైసూర్, కాన్పూర్, వరంగల్, అలహాబాద్, అలీగడ్‌, జైపూర్, చండీగఢ్; రాజ్‌కోట్‌,వడోదర, వెల్లూరు, తిరుపతి, డామన్ తదితర నగరాలకు గ్రాసరీ సేవలను అందించనున్నట్టు తెలిపింది.  (డెలివరీ : ఫ్లిప్‌కార్ట్‌ కీలక నిర్ణయం)

 కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో లక్షలాది కస్టమర్లు కిరాణా సరుకుల కోసం ఆన్‌లైన్‌ బాట పట్టారు. దీంతో మెట్రోలతోపాటు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఈ-గ్రాసరీ డిమాండ్‌ పెరిగిందని కంపెనీ తెలిపింది. ఏడాదిలో వ్యాపారం మూడింతలైందని వివరించింది. మార్కెట్‌ప్లేస్‌ ద్వారా స్థానిక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు ఊతమివ్వడమేగాక లక్షలాది మంది వినియోగదార్లను రైతులతో అనుసంధానిస్తున్నట్టు తెలిపింది. కంపెనీ మెట్రోలతోపాటు తిరుపతి, వరంగల్‌ వంటి నగరాల్లోనూ అడుగుపెట్టింది. ఫ్లిప్‌కార్ట్‌ గ్రాసరీ విభాగంలో 200లపైచిలుకు విభాగాల్లో కలిపి 7,000లకుపైగా ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. 2020లో రూ.24,090 కోట్లున్న ఈ-గ్రాసరీ విపణి 2025 నాటికి రూ.1,75,200 కోట్లకు చేరనుందని కన్సల్టింగ్‌ సంస్థ రెడ్‌సీర్‌ ఇటీవల వెల్లడించింది. 50 శాతంపైగా కిరాణా సరుకుల రిటైల్‌ మార్కెట్‌ను ఈ-గ్రాసరీ ప్లాట్‌ఫామ్స్‌ సేవలందించే వీలుందని వివరించింది. అమెజాన్, రిలయన్స్, బిగ్‌ బాస్కెట్, గ్రోఫర్స్‌ వంటి సంస్థలూ ఈ రంగంలో పోటీపడుతున్నాయి. 

మరిన్ని వార్తలు