గోద్రెజ్‌ ప్రాపర్టీస్ బోర్లా‌‌- ఎన్‌ఎఫ్‌ఎల్‌ ఖుషీ

3 Nov, 2020 13:46 IST|Sakshi

క్యూ2(జులై- సెప్టెంబర్‌) ఫలితాల ఎఫెక్ట్‌

10 శాతం పతనమైన గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌

యూరియాయేతర ఎరువుల విక్రయాలు జూమ్‌

9 శాతం దూసుకెళ్లిన ఎన్‌ఎఫ్‌ఎల్‌ షేరు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో రియల్టీ కంపెనీ గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ కౌంటర్‌లో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం తొలి 7 నెలల్లో(ఏప్రిల్‌- అక్టోబర్‌) నాన్‌యూరియా ఫెర్టిలైజర్స్‌ అమ్మకాలు జోరందుకోవడంతో నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌(ఎన్‌ఎఫ్‌ఎల్‌) కౌంటర్‌కు డిమాండ్‌ కనిపిస్తోంది. వెరసి గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ కౌంటర్‌ భారీ నష్టాలతో కళ తప్పగా.. ఎన్‌ఎఫ్‌ఎల్‌ భారీ లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం..
 
గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ నికర లాభం 78 శాతం క్షీణించి రూ. 7 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 65 శాతం నీరసించి రూ. 90 కోట్లకు చేరింది. పన్నుకు ముందు లాభం 69 శాతం పడిపోయి రూ. 22.6 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 9.3 శాతం కుప్పకూలి రూ. 1,036 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,030 వరకూ వెనకడుగు వేసింది.

ఎన్‌ఎఫ్‌ఎల్‌
ఈ ఆర్థిక సంవత్సరం తొలి 7 నెలల్లో అన్నిరకాల యూరియాయేతర ఎరువుల అమ్మకాలు జోరందుకున్నట్లు నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ తెలియజేసింది. డీఏపీ, ఎంవోపీ, ఎన్‌పీకే తదితర ఎరువుల వాడకంలో రైతులకు కంపెనీ ఇస్తున్న శిక్షణ ఇందుకు దోహదం చేసినట్లు పేర్కొంది. దీనిలో భాగంగా పానిపట్‌లో తయారైన బెంటోనైట్‌ సల్ఫర్‌ అమ్మకాలు 3478 ఎంటీ నుంచి 11,730 ఎంటీకి ఎగశాయి. ఇదేవిధంగా ఎస్‌ఎస్‌పీ విక్రయాలు 6323 ఎంటీ నుంచి 14,726 ఎంటీకి పెరిగాయి. ఈ నేపథ్యంలో ఎన్‌ఎఫ్‌ఎల్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 9 శాతం దూసుకెళ్లి రూ. 32.5 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 34 వరకూ ఎగసింది.

మరిన్ని వార్తలు