వొడా ఐడియాకు ఊరట.. ప్రభుత్వానికి మెజారిటీ వాటా!

4 Feb, 2023 06:57 IST|Sakshi

న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన వొడాఫోన్‌ ఐడియా (వీఐఎల్‌) కట్టాల్సిన రూ. 16,133 కోట్ల వడ్డీ బాకీలను ఈక్విటీ కింద మార్చుకునే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. స్పెక్ట్రం వాయిదాలు, సవరించిన స్థూల లాభాలపై కట్టాల్సినది (ఏజీఆర్‌) కలిపి ప్రభుత్వానికి వీఐఎల్‌ భారీగా బాకీ పడింది. సంస్థ ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా బకాయిలకు సంబంధించి ప్రభుత్వానికి ఈక్విటీ షేర్లను వాటాగా కేటాయించింది.  దీంతో రూ.10 షేర్‌ విలువతో రూ.16,133 కోట్ల విలువైన షేర్లను కంపెనీ కేంద్రానికి  బదిలీ చేసింది.

తమ భాకీలను ఈక్విటీగా మార్చుకుంటే తమ సంస్థలో ప్రభుత్వానికి 33.14 శాతం వాటా లభించగలదని వీఐఎల్‌ గతంలో తెలిపింది. పలు కారణాలతో కేంద్రం ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వస్తోంది. అయితే తాజాగా దీనికి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. భారతదేశ టెలికాం రంగంలో బిలియనీర్ ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. జియో దెబ్బకు ఈ రంగంలోని పలు టెలికాం కంపెనీలు మూతపడ్డాయి. మరో వైపు ప్రభుత్వానికి చెల్లించాల్సిన భారీ బకాయిలు కూడా టెలికాం రంగం ఇబ్బందులను మరింత పెంచాయి.


 

చదవండి: అదానీ గ్రూప్‌: బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ

మరిన్ని వార్తలు