హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ చేతికి ఎక్సైడ్‌ లైఫ్‌

4 Sep, 2021 04:47 IST|Sakshi

100 శాతం వాటా కొనుగోలు

డీల్‌ విలువ రూ. 6,687 కోట్లు

ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌కు మైనారిటీ వాటా

ముంబై: ప్రైవేట్‌ బీమా రంగంలో సరికొత్త డీల్‌కు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తెరతీసింది. ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ నుంచి బీమా అనుబంధ సంస్థ ఎక్సైడ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ.6,687 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ డీల్‌కు అటు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఇటు ఎక్సైడ్‌ లైఫ్‌ కంపెనీల బోర్డులు తాజాగా ఆమోదముద్ర వేశాయి. ఒప్పందంలో భాగంగా ఎక్సైడ్‌ లైఫ్‌లో 100% వాటాను సొంతం చేసుకోనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ వెల్లడించింది. షేరుకి రూ.685 ధరలో 8.7 కోట్లకుపైగా హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్లను ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌కు జారీ చేయనుంది. తద్వారా కొనుగోలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా మరో రూ. 726 కోట్లను నగదు రూపంలో ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌కు  చెల్లించనున్నట్లు వివరించింది.  లావాదేవీ పూర్తయ్యాక హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ సంస్థలో ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌కు 4.1% వాటాను పొందనుంది.

విలీనంవైపు..: పూర్తి వాటా కొనుగోలు ప్రక్రియ పూర్తికాగానే ఎక్సైడ్‌ లైఫ్‌ను విలీనం చేసుకోనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ పేర్కొంది. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏతోపాటు, కాంపిటీషన్‌ కమిషన్‌(సీసీఐ), జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ), స్టాక్‌ ఎక్సే్ఛంజీల నుంచి అనుమతులు లభించవలసి ఉన్నట్లు తెలియజేసింది. వీటితోపాటు రెండు కంపెనీల వాటాదారుల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించాక కొనుగోలు లావాదేవీని పూర్తిచేయనున్నట్లు తెలియజేసింది. దేశీ బీమా రంగంలో ఈ డీల్‌ ల్యాండ్‌మార్క్‌ వంటిదని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ పేర్కొన్నారు. దీంతో మరింత మందికి బీమా రక్షణ లభించే వీలుంటుందని అభిప్రాయపడ్డారు. ఎక్సైడ్‌ బ్రాండు వినియోగానికి రెండేళ్ల కాలపరిమితి లభించనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఎండీ, సీఈవో విభా పడల్కర్‌ వెల్లడించారు.

ఎక్సైడ్‌ లైఫ్‌ తీరిదీ..: 2001–02లో కార్యకలాపాలు ప్రారంభించిన ఎక్సైడ్‌ లైఫ్‌ 2021 జూన్‌కల్లా రూ.2,711 కోట్ల అసలు విలువను సాధించింది. గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో మొత్తం రూ. 3,325 కోట్ల విలువైన ప్రీమియంను అందుకుంది. జూన్‌కల్లా రూ. 18,780 కోట్ల విలువైన ఏయూఎంను కలిగి ఉంది.  

ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3.3 శాతం పతనమై రూ. 734 వద్ద ముగిసింది. ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 189 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు