సంక్షోభంతో అల్లాడుతున్న పాక్‌కు షాక్‌: మరో ప్లాంట్‌ షట్‌డౌన్‌

9 Mar, 2023 12:42 IST|Sakshi

న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్‌కు మరో షాక్‌ తగిలింది. సరఫరా గొలుసులో తీవ్ర అంతరాయం ఏర్పడిందని పేర్కొంటూ మరో కార్ల తయారీ సంస్థ హోండా తన ప్లాంట్‌ను మూసివేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు పాక్‌కు గుడ్‌బై చెబుతుండగా, ఈ  జాబితాలో తాజాగా ఆటోమొబైల్ దిగ్గజం హోండా కూడా చేరింది. ప్రస్తుతం పాక్‌లోని హోండా అట్లాస్ కార్స్ పేరుతో కార్లను అసెంబుల్ చేస్తోంది. దేశంలోని ప్రస్తుత ఆర్థిక పరిస్థితులే మూసివేతకు కారణమని  ప్రకటించింది.

జియో న్యూస్ ప్రకారం మార్చి 9 నుంచి 31 వరకు హోండా తన ఫ్లాంట్‌ను మూసివేయనుంది. పాక్‌  ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఉత్పత్తిని కొనసాగించలేని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు  అక్కడి స్టాక్ఎక్స్ఛేంజ్‌కు అందించిన సమాచారంలో  కంపెనీ తెలిపింది.   ప్రభుత్వం పూర్తి నాక్-డౌన్‌ కిట్ల దిగుమతి కోసం లెటర్ ఆఫ్ క్రెడిట్ నిషేధం, ముడిసరుకు, విదేశీ చెల్లింపుల స్తంభన లాంటి  చర్యలతో సరఫరా గొలుసు తీవ్రంగా దెబ్బతిందని కంపెనీ తెలిపింది.

కాగా అధిక  ద్రవ్యోల్బణం,  పాక్‌ కరెన్సీ క్షీణత,  దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన పాకిస్తాన్ ఆటో పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుందని జియో న్యూస్ నివేదించింది. వాణిజ్య లోటును నియంత్రించేందుకు సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిగుమతుల ఆంక్షలతో ఆటో పరిశ్రమ కూడా దెబ్బతిన్నదని వ్యాఖ్యానించింది. ఉత్పత్తి కార్యకలాపాలు దెబ్బతినడమే కాకుండా కంపెనీలు తమ సీకేడీ మోడళ్ల ధరలను కూడా పెంచాయి, ఇది ఇప్పటికే ప్రజల కొనుగోలు శక్తిని ప్రభావితం చేసిందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పాక్‌లోని  టయోటా-బ్రాండ్ ఆటోమొబైల్స్‌కు  చెందిన  సుకుజీ మోటార్ కంపెనీ (PSMC) ఇండస్ మోటార్ కంపెనీ (IMC) అసెంబ్లర్లు కూడా తమ ఉత్పత్తి ప్లాంట్లను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు