హానర్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌: స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయ్‌!

22 Aug, 2023 09:55 IST|Sakshi

మార్కెట్లోకి మళ్లీ హానర్‌ స్మార్ట్‌ఫోన్లు: సీఈవో మాధవ్‌ సేథ్‌

 2024లో స్థానిక ఉత్పత్తి

Honor Comeback: హానర్‌ బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్లు మళ్లీ భారత్‌ మార్కెట్లోకి రానున్నాయి. చైనా స్మార్ట్‌ డివైజెస్‌ సంస్థ హానర్‌ నుంచి లైసెన్సు పొందిన హానర్‌టెక్‌ కంపెనీ వీటిని సెపె్టంబర్‌లో ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉంది. ఈ వ్యాపారానికి సంబంధించి రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. హానర్‌టెక్‌ సీఈవో మాధవ్‌ సేథ్‌ ఈ విషయాలు వెల్లడించారు.

వచ్చే ఏడాది ఆఖరు నాటికి 4-5 శాతం మార్కెట్‌ వాటాను దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు, తద్వారా రూ. 10,000 కోట్లు ఆదాయం సాధించే అవకాశాలు ఉన్నట్లు ఆయన వివరించారు. హానర్‌టెక్‌ పూర్తిగా భారత సంస్థ అని, హానర్‌ నుంచి తీసుకున్న లైసెన్సుతో ఇక్కడే తయారీ నుంచి అమ్మకాల కార్యకలాపాలు నిర్వహించనున్నామని సేథ్‌ చెప్పారు. చైనా టెలికం దిగ్గజం హువావే అప్పట్లో హానర్‌ బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 2020లో మరో చైనా సంస్థకు దాన్ని విక్రయించింది. మరోవైపు, రియల్‌మి అంతర్జాతీయ వ్యాపారానికి సారథ్యం వహిస్తున్న సేథ్‌ ఇటీవలే దాన్నుంచి తప్పుకున్నారు. వ్యాపారవేత్త సీపీ ఖండేల్వాల్‌కి చెందిన పీఎస్‌ఏవీ గ్లోబల్‌తో కలిసి హానర్‌టెక్‌ను జాయింట్‌ వెంచర్‌గా ఏర్పాటు చేశారు.   

మరిన్ని వార్తలు