Huawei : ఆండ్రాయిడ్‌ స్థానంలో హర్మోని

4 Jun, 2021 16:17 IST|Sakshi

హర్మోని ఓఎస్‌ డెవలప్‌ చేసిన హువావే

ఇకపై హువావే ఉత్పత్తులన్నీ హర్మోనితోనే

ఆండ్రాయిడ్‌కి హర్మోని  ప్రత్యామ్నయం కాగలదా ?

వెబ్‌డెస్క్‌ : ప్రముఖ టెక్‌ దిగ్గజ సంస్థ హువావే ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌కి మంగళం పాడేందుకు రెడీ అయ్యింది. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ స్థానంలో తనదైన స్వంత ఆపరేటింగ్‌ సిస్టమ్‌ హర్మోనిని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.  క్రమంగా హువావేకు చెందిన స్మార్ట్‌ఫోన్లు, ట్యాబెట్లు, వేరబుల్‌ గాడ్జెట్లలో ఆండ్రాయిడ్‌ స్థానంలో హర్మోని ఓఎస్‌ తేబోతున్నట్టు ఆ సంస్థ తెలిపింది.  

ఆండ్రాయిడ్‌పై ఆధారపడలేం
స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసేందుకు టెక్‌ జెయింట్‌ హువావే పకడబ్బంధీగా పావులు కదుపుతోంది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌కి సమాంతరంగా హువావే రూపొందించిన హర్మోనీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌)తో స్మార్ట్‌ఫోన​‍్లు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హువావే ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్లయిన మేట్‌ 40, మేట్‌ X 2లలో రాబోయే మోడల్స్‌ని  హర్మోని ఓఎస్‌తో తీసుకువస్తామని ప్రకటించింది. అంతేకాదు క్రమంగా ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ వెర్షన్‌పై ఉన్న ఫోన్లను సైతం హర్మోని ఓఎస్‌ పరిధిలోకి తెస్తామని చెప్పింది. హువావే పరికరాలపై అమెరికా అభ్యంతరాలు చెప్పడం ప్రారంభించినప్పుడే  హువావే సొంత ఓఎస్‌పై దృష్టి పెట్టింది. క్రమంగా అమెరికాకు చెందిన గూగుల్‌ రూపొందించిన ఆండ్రాయిడ్‌పై ఆధారపడటం తగ్గించాలని నిర్ణయించింది.  రాబోయే రోజుల్లో హువావే నుంచి వచ్చే ట్యాబ్స్‌, వేరబుల్‌ డివైజెస్‌, టీవీలు అన్నింటిని హర్మోని ఓఎస్‌తోనే తేవాలని నిర్ణయించింది.

ప్రత్యామ్నయం సాధ్యమేనా
స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ఆండ్రాయిడ్‌ హవాకు అడ్డుకట్ట వేయడం ఆపిల్‌ లాంటి సంస్థలకే సాధ్యం కాలేదు. ఐనప్పటికీ ఆండ్రాయిడ్‌కి ప్రత్యామ్నయంగా ఐఓఎస్‌ ఒక్కటే మార్కెట్‌లో నిలబడింది. స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ రాజ్యమేలుతోంది. ఆండ్రాయిడ్‌కు ప్రత్యామ్నాయంగా సామ్‌సంగ్‌ సం‍స్థ టైజన్‌ పేరుతో స్వంత ఓఎస్‌ డెవలప్‌చేసినా.. మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో సామ్‌సంగ్‌ సైతం ఆండ్రాయిడ్‌ ఓఎస్‌తోనే ఫోన్లు తెస్తోంది. మరీ హువావే హర్మోని ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై మార్కెట్‌ వర్గాలు ఆసక్తిగా ఉన్నాయి. 
 

మరిన్ని వార్తలు