బీమా కంపెనీలు.. వీటిపై దృష్టి పెట్టాలి

1 Nov, 2021 13:37 IST|Sakshi

కస్టమర్ల మార్పు ధోరణులపై దృష్టి పెట్టాలి

బీమా సంస్థలు విస్తృత పాత్ర పోషించాలి

మరిన్ని కాంబో పథకాలు అందించాలి  

కోవిడ్‌ పరిణామాల నేపథ్యంలో కస్టమర్ల ధోరణులు చాలా వేగంగా మారాయి. నిత్యావసరాల షాపింగ్, ఉద్యోగ విధుల నిర్వహణ మొదలుకుని ఆర్థిక లావాదేవీల వరకూ అన్నింటి నిర్వహణకు కొత్త విధానాలకు మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాదిన్నర కాలంగా డిజిటల్‌ సేవలు, కస్టమర్‌ సర్వీస్, అండర్‌రైటింగ్‌ తదితర విభాగాల్లో బీమా రంగం కూడా ఈ మార్పులను కొంత మేర చవిచూసింది. రాబోయే రోజుల్లో ఎప్పటికప్పుడు మారిపోతున్న కస్టమర్ల ధోరణులపై బీమా కంపెనీలు మరింతగా దృష్టి పెట్టాల్సి రానుంది. అలాగే, బీమా సంస్థలు మరింత విస్తృతమైన పాత్ర పోషించాల్సి వస్తుంది. క్లెయిముల సమయంలో చెల్లింపులు జరిపే సంస్థలుగా మాత్రమే మిగిలిపోకుండా, సంరక్షించే .. అనుకోని అవాంతరాలను నివారించగలిగే భాగస్వామిగా మారాల్సి ఉంటుంది. కొత్త కస్టమర్లలో ప్రధానంగా కొన్ని ధోరణులు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి ఇలా ఉన్నాయి.

అంతా డిజిటల్‌
ప్రస్తుతం అన్ని వయస్సుల వారు కూడా డిజిటల్‌ విషయంలో మిలీనియల్‌ యువత ఆలోచన ధోరణులకు తగ్గట్లుగా వ్యవహరిస్తున్నారు. రాబోయే రోజుల్లో లావాదేవీల నిర్వహణ ఎంత సులభతరంగా ఉంది, ఎంత వేగంగా చేయగలుగుతున్నారు అన్నవి కీలకంగా మారతాయి. కస్టమర్లకు మెరుగైన అనుభూతిని అందించేందుకు డేటాను వినియోగించడం, డిజిటైజేషన్‌ను వేగవంతం చేయాల్సి ఉంటుంది. 
మరింత కోరుకుంటున్న కస్టమర్లు
కస్టమర్ల కొనుగోలు ధోరణుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. కస్టమైజేషన్‌కు ప్రాధాన్యం పెరిగిందే. రాబోయే రోజుల్లో ఒకే ఉత్పత్తిని అందరికీ ఉపయోగించవచ్చంటే కుదరదు. పాలసీదారు తగినంత జీవిత బీమా కవరేజీతో పాటు నిర్దిష్ట రిస్కులకు కూడా కవరేజీ కోరుకుంటారు. పాలసీదారుల వ్యక్తిగత అవసరాలకు తగ్గట్లుగా వైవిధ్యమైన, సరళమైన, కొంగొత్త పథకాలను అందించడంపై కంపెనీలు మరింతగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. మరోవైపు, పలువురు కస్టమర్లు అనుభూతికి ప్రాధాన్యమిచ్చే వారై ఉంటున్నారు. సత్వరం స్పందించడం, వేగంగా పరిష్కార మార్గం చూపడం, భారీ స్థాయి సెల్ఫ్‌–సర్వీస్‌ సామర్థ్యాలు మొదలైనవి వీరు కోరుకుంటారు. కాబట్టి లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు తమ కస్టమర్లకు తలెత్తబోయే అవసరాలను ముందస్తుగానే గుర్తించగలిగి, తగు వ్యూహాలను అమలు చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. 

ఎక్కడైనా, ఎప్పుడైనా
ప్రస్తుతం కస్టమర్లు ఎప్పుడైనా, ఎక్కడైనా సరే చిటికె వేయగానే సర్వీసులు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నారు. సులభతరమైన ప్రక్రియలు, డిజిటల్‌ మాధ్యమాల వినియోగం రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది. దీంతో బీమా సంస్థలు మరిన్ని విధాలుగా కస్టమరుకు చేరువలో ఉండాలి. భౌతికమైన బ్రాంచీలు, ఫోన్‌ ఆధారిత కాంటాక్ట్‌ సెంటర్లు, చాట్‌బాట్స్, వాయ్సాప్, మొబైల్‌ యాప్స్, సోషల్‌ మీడియా ఇలా అన్ని చోట్ల అందుబాటులో ఉండగలగాలి.  
ఆరోగ్యానికి ప్రాధాన్యత
మహమ్మారి పరిణామాల నేపథ్యంలో కస్టమర్లలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. ఎప్పటికప్పుడు మారే తమ అవసరాలను అర్థం చేసుకునే కంపెనీలకు వారు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపత్యంలో జీవిత బీమా, ఆరోగ్య బీమా కంపెనీలు పరస్పరం తమ అనుభవాల ఆధారంగా కాంబో పథకాల్లాంటివి మరింతగా అందుబాటులోకి తేవాలి. కస్టమర్‌ బీమా అవసరాలన్నీ ఒకే చోట తీరేలా చూడగలగాలి. ఆరోగ్యాన్ని సంరక్షించుకునేలా కస్టమర్లను ప్రోత్సహించడం, రిస్కులు తగ్గించుకునే క్రమంలో బీమా సంస్థలు.. పలు వెల్‌నెస్‌ పార్ట్‌నర్స్‌తో చేతులు కలపవచ్చు.  
కాలానుగుణంగా
ఏదేమైనా ఆరోగ్యం, సౌకర్యం, సరళత్వం ప్రాతిపదికగా సానుకూల అనుభూతి కలిగించే మార్పుల ప్రభావం చాలా కాలం పాటు ఉంటుంది. రిస్కులను తగ్గించడంతో పాటు విలువ ఆధారిత సేవలను అందించడంలో విభిన్నమైన పథకాలు అందించడంపై బీమా సంస్థలు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మారే కాలానికి అనుగుణంగా తామూ మారడం బీమా కంపెనీలకు ఎంతో కీలకం. 
 

మరిన్ని వార్తలు