యుద్ధానికి సిద్ధం | Sakshi
Sakshi News home page

యుద్ధానికి సిద్ధం

Published Sat, Sep 30 2023 4:46 AM

CM YS Jagan in YSR Vahana Mitra Meeting - Sakshi

బోయేది ఎన్నికల కురుక్షేత్ర యుద్ధం! ఎలాంటి లంచాలు, అవినీతికి తావు లేకుండా ప్రజలందరికీ మేలు చేస్తున్న మీ బిడ్డ ప్రభుత్వం ఒకవైపు... కేవలం దోచుకోవటానికి పంచు కోవటానికి, దాచుకోవటానికి మాత్రమే ఉన్న పెత్తందార్లు మరోవైపు నిలిచిన యుద్ధమిదీ. పేదల అనుకూల ప్రభుత్వానికి, పెత్తందార్లకు మధ్య జరిగే యుద్ధం ఇది. ఈ ఎన్నికల యుద్ధంలో మీకు అండగా ఉన్న  మీ బిడ్డ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి.
– ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తూ అమలు చేస్తున్న మీ బిడ్డ ప్రభుత్వం ఒకవైపున నిలిస్తే.. ప్రజలను మోసగించేందుకే మేనిఫెస్టోను తీసుకొచ్చి ఆ తరువాత చెత్తబుట్టలో పడేసిన చరిత్ర ఉన్నవారు మరోవైపున మోహరించారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నిరుపేదలకు అండగా నిలిచిన మనసున్న ప్రభుత్వం ఓ వైపు.. పేదలను వంచించిన మనసు లేని గత పాలకులు మరోవైపు ఉన్నారని చెప్పారు.

నీతివంతంగా అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతాలకు మంచి చేస్తున్న మన ప్రభుత్వం ఒకవైపున ఉంటే.. మరోవైపున సామాజిక అన్యాయాలు, ప్రాంతాలకు అన్యాయాలు చేయడమే చరిత్రగా ఉన్న ప్రత్యర్ధులు మరోవైపున ఉన్నారని తెలిపారు. శుక్రవారం విజయవాడలో వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ద్వారా వరుసగా ఐదో విడత కింద 2,75,931 మంది లబ్దిదారులకు రూ.275.93 కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్‌ నొక్కి బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన అనంతరం నిర్వహించిన సభలో సీఎం జగన్‌ మాట్లాడారు. మేనిఫెస్టోను పవిత్ర భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావిస్తూ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి చెప్పిన ప్రతీది అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 99 శాతం వాగ్దానాలను పూర్తి చేసి మన ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని చెప్పారు. సభలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..   

కులమతాలు లేవు.. పేదలు – పెత్తందారులే 
ఈ రోజు మనం వేసే ప్రతి అడుగు, ప్రతి ఓటు.. పేదవాడిని రక్షించుకోవడానికే వేస్తున్నాం. పేదవాడి ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు అడుగులు వేస్తున్నాం. ఒక పెత్తందారీ ప్రభుత్వం రాకూడదని అడుగులు వేస్తున్నాం. పేదవాడికి, పెత్తందార్లకు మధ్య యుద్ధం జరగబోతోంది. ఈ యుద్ధంలో కులాలు లేవు... మతాలు లేవు. పేదవాడు ఒకవైపు, పెత్తందారులు మరోవైపు ఉన్నారన్నదే గుర్తు పెట్టుకోండి.   

గతంలో డబ్బులు ఎందుకు రాలేదు? 
నాడు కూడా ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్‌! కేవలం మారిందల్లా ముఖ్యమంత్రి ఒక్కడే. అప్పుల పెరుగుదల కూడా అప్పటికన్నా మీ బిడ్డ హయాంలోనే తక్కువే. మరి మీ బిడ్డ ఎలా బటన్‌ నొక్కగలుగుతున్నాడు? వివక్ష, లంచాలు లేకుండా రూ.2.35 లక్షల కోట్లను అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా ఎలా జమ చేయగలుగుతున్నాడు? మీకు గతంలో ఎందుకు డబ్బులు రాలేదు? ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? అనేది ఆలోచన చేయండి.   

ఆ గజదొంగల ముఠాను నమ్మి మోసపోకండి 
వాళ్ల మాదిరిగా నాకు ఒక గజదొంగల ముఠా తోడుగా లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి తోడుగా లేదు. టీవీ 5 అండగా లేదు. ఒక దత్తపుత్రుడు తోడు అంతకన్నా లేదు. దోచుకుని, పంచుకుని, తినుకోవడం నా విధానం కాదు. నేను నమ్ముకున్నది పైన దేవుడిని, ఆ తర్వాత మిమ్మల్నే. అదే నా విధానం. వారికి అధికారం కావాల్సింది దోచుకోవడానికి.. దోచుకున్నది పంచుకోవడానికి.. పంచుకున్నది తినడానికే! రాబోయే రోజుల్లో వాళ్లు మీ ఇంటికి వస్తారు. ఒక్కో ఇంటికి కేజీ బంగారం, ఒక బెంజ్‌ కారు కూడా ఇస్తామని కూడా చెబుతారు. అటువంటి వాళ్లు చెబుతున్న అబద్ధాలను నమ్మకండి. మీ ఇంటిలో మీకు మంచి జరిగిందా..  లేదా? అన్నదే కొలమానంగా తీసుకొండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికుడిలా అండగా నిలబడండి.   

ఇటువైపు స్కీమ్‌లు... అటువైపు స్కామ్‌లు 

►ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారీ్టలకు డీబీటీలో 80 శాతం నేరుగా బటన్‌ నొక్కి పారదర్శకంగా అందచేశాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో 83 శాతం ఉద్యోగాలను వారికే అందించిన మనందరి ప్రభుత్వం ఒకవైపున ఉంటే.. మరోవైపున ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అని హూంకరించిన అహంకారానికి, బీసీల తోకలు కత్తిరిస్తా.. ఖబడ్డార్‌? అని బెదిరించిన కండకావరానికి మధ్య యుద్ధం జరగబోతోంది. 

► గవర్నమెంట్‌ స్కూళ్లలో నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారీ్టలు, నా పేద ఓసీ వర్గాల పిల్లలకు సీబీఎస్‌ఈ విద్యా బోధనను ప్రవేశపెట్టడంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు ‘ఐబీ’ సిలబస్‌ దిశగా కూడా అడుగులు వేస్తున్న మనందరి ప్రభుత్వం ఒకవైపున ఉంటే.. మరోవైపున పేద వర్గాలకు ఇంగ్లీషు మీడియం చదువులు అందకూడదని, వారు పెద్ద చదువులు చదవకూడదనే పెత్తందారీ మనస్తత్వం ఉన్న వారితో ఎన్నికల సంగ్రామం జరగనుంది. 

►పేదలెవరూ గూడులేక ఇబ్బంది పడకూడదని రాష్ట్రవ్యాప్తంగా 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చి ఒక ఇంటివారు కావాలని తపిస్తున్న మనందరి ప్రభుత్వం ఒకవైపున ఉంటే.. మరోవైపున ఈ పేదలకు ఇళ్లపట్టాలే ఇవ్వకూడదు, వారికి ఇళ్లపట్టాలిస్తే డెమోగ్రాఫిక్‌ ఇంబ్యాలన్స్‌ అంటే కులాల మధ్య వ్యత్యాసం వస్తుందని ఏకంగా కోర్టులకెళ్లి కేసులు వేస్తున్న ఆ పెత్తందారులతో ఎన్నికల యుద్ధం జరగబోతోంది. 

► ఒక్క పైసా కూడా లంచాలకు తావు లేకుండా, వివక్ష లేకుండా బటన్‌ నొక్కి నేరుగా ఏకంగా రూ.2.35 లక్షల కోట్లను పేదల ఖాతాల్లోకి పారదర్శకంగా పంపించిన మీ బిడ్డ ప్రభుత్వం ఒకవైపు ఉంటే... మరోవైపున ఫైబర్‌ గ్రిడ్‌ స్కామ్, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కామ్, అసైన్డ్‌ భూముల స్కామ్, అమరావతి పేరిట చేసిన అతిపెద్ద దగా, జన్మభూమి కమిటీల పేరిట చేసిన దుర్మార్గాలు, నీరు –  చెట్టు పేరిట సాగించిన దోపిడీ, రైతులకు చేసిన మోసాలు, అక్కచెల్లెమ్మలకు మాట ఇచ్చి చేసిన వంచనలు, పిల్లలను సైతం వదలకుండా అన్ని వర్గాలను మోసం చేసిన వారితో ఎన్నికల యుద్ధం జరగబోతుంది.  

ఇదీ చదవండి: అందరికీ ఉచిత ఆరోగ్య పరీక్షలు: సీఎం జగన్‌

Advertisement
Advertisement