అమెరికా, రష్యా ఆధిపత్య పోరు.. చుక్కలను తాకుతున్న ముడి చమురు

9 Mar, 2022 08:23 IST|Sakshi

రష్యా చమురు దిగుమతులపై అమెరికా నిషేధం... 

యూస్‌ నిర్ణయంతో కొనసాగుతున్న క్రూడ్‌ మంటలు

అమెరికా బాటలో నడవని యూరప్‌ దేశాలు 

న్యూయార్క్‌: అమెరికా రష్యాల మధ్య ఆధిపత్య పోరుతో క్రూడ్‌ ధర అంతర్జాతీయంగా సెగలు పుట్టిస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా తీవ్ర దాడుల నేపథ్యంలో ఆ దేశం నుంచి దిగుమతులను  నిషేధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించడంతో చమురు మంట మరింత ఎగసింది. మంగళవారం బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారల్‌ ధర క్రితం ముగింపుతో పోల్చితే 8 శాతం పైగా (దాదాపు 9 డాలర్లు) లాభంతో  132 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక అమెరికా నైమెక్స్‌ క్రూడ్‌  కూడా ఇదే స్థాయిలో ఎగసి 129 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.  2008 తరువాత ఇంత తీవ్ర స్థాయిలో క్రూడ్‌ ధరలు  చూడటం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ క్రూడ్‌ గరిష్ట స్థాయి 147 డాలర్లు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో 2008 జూలైలో క్రూడ్‌ ఈ స్థాయిని చూసింది. 

సందిగ్ధంలో యూరప్‌
ప్రపంచ ముడి చమురు సరఫరాల్లో రష్యా వాటా 7 శాతం ఉండగా, ఉత్పత్తిలో 10 శాతం ఉంది. అమెరికా దిగుమతి చేసుకున్న ముడి చమురులో రష్యా వాటా కేవలం 10 శాతమే. ఇదే యూరప్‌ దేశాల విషయానికి వస్తే అధికంగా ఉంది. ఒక్క జర్మనినీ పరిశీలిస్తే ఆ దేశ అవసరాల్లో 40 శౠతం ముడిచమురు, సహాజవాయువుని రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. దీంతో అమెరికా తరహాలో రష్యా నుంచి సరఫరాలపై నిషేధంపై యూరోపియన్‌ యూనియన్‌ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. 

200 డాలర్లకు
రష్యా నుంచి ముడిచమురు, గ్యాస్‌ దిగుమతులపై ఆంక్షలు విధిస్తే బ్యారెల్‌ ముడిచమురు ధర 300 డాలర్ల వరకు చేరుకోవచ్చంటూ రష్యా ఉప ప్రధాని అలెగ్జాండ్‌ నోవాక్‌ ఇప్పటికే హెచ్చరించారు. అయితే అంతర్జాతీయ చమురు మార్కెట్‌ విశ్లేషకులు, ట్రేడర్లు మాత్రం త్వరలోనే క్రూడ్‌ 200 డాలర్లను తాకొచ్చన్న అంచనాలు వెలిబుచ్చుతున్నారు. 

రూపాయి మరింత పతనం 
అంతర్జాతీయంగా తీవ్ర ప్రతికూల పరిణామాల నేపథ్యంలో ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ వరుసగా రెండవరోజూ కొత్త కనిష్టాన్ని తాకింది. ట్రేడింగ్‌లో 7 పైసలు నష్టపోయి జీవితకాల కనిష్టం 77 వద్ద ముగిసింది. వరుసగా ఐదు ట్రేడింగ్‌ సెషన్ల నుంచి రూపాయి జారుడుబల్లపై కొనసాగుతోంది. ట్రేడింగ్‌లో 77.02 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ 76.71 గరిష్ట–77.05 కనిష్ట స్థాయిలను చూసింది. రూపాయికి ఇంట్రాడే కనిష్టం (77.05)–ముగింపుల్లో (77) సోమవారం స్థాయిలే రికార్డులు.

చదవండి: భారీ డిస్కౌంట్‌కు రష్యా ఆయిల్‌ 

మరిన్ని వార్తలు