వైజాగ్‌ స్టీల్‌పై ఆర్సెలర్‌మిట్టల్‌ నిప్పన్‌ దృష్టి

24 Aug, 2021 02:04 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ వైజాగ్‌ స్టీల్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌)పై ప్రైవేట్‌ రంగ ఉక్కు దిగ్గజం ఏఎంఎన్‌ఎస్‌ ఇండియా (ఆర్సెలర్‌మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌) సంస్థ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్‌ఐఎన్‌ఎల్‌ కొనుగోలు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, కంపెనీ మాత్రం ఈ విషయం ్ర«ధువీకరించలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏఎంఎన్‌ఎస్‌ మాతృ సంస్థ ఆర్సెలర్‌మిట్టల్‌ చైర్మన్‌ లక్ష్మి నివాస్‌ మిట్టల్‌ భేటీ అవుతున్నట్లు ఏఎంఎన్‌ఎస్‌ గురువారం ట్వీట్‌ చేసింది. అయితే, సమావేశ వివరాలను మాత్రం వెల్లడించలేదు.

ఈ నేపథ్యంలో వైజాగ్‌ స్టీల్‌పై కంపెనీ దృష్టి పెట్టిందన్న వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గుజరాత్‌లోని ఏఎంఎన్‌ఎస్‌ ఇండియాలో ఆర్సెలర్‌మిట్టల్‌కు 60 శాతం, జపాన్‌కు చెందిన నిప్పన్‌ స్టీల్‌కు 40 శాతం వాటాలు ఉన్నాయి. వైజాగ్‌ స్టీల్‌పై ఆసక్తిగా ఉన్నట్లు దేశీ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్‌ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. తూర్పు తీరంలో ఉన్న ఆర్‌ఐఎన్‌ఎల్‌ కొనుగోలు చేస్తే ఆగ్నేయాసియా మార్కెట్లలోకి మరింత చొచ్చుకుపోయేందుకు వీలుంటుందని భావిస్తున్నట్లు టాటా స్టీల్‌ సీఈవో టీవీ నరేంద్రన్‌ ఇటీవల తెలిపారు. వైజాగ్‌ స్టీల్‌లో 100 శాతం వాటాల విక్రయ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీఈఏ) జనవరి 27న సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది.

మరిన్ని వార్తలు