Linkedin: మీరు ఈ టెక్నాలజీలో ఎక్స్‌పర్టా? అయితే మీకు జాబులే జాబులు!!

17 Jan, 2022 13:58 IST|Sakshi

మార్కెట్‌లోకి కొత్తగా పుట్టుకొస్తున్న టెక్నాలజీకి అనుగుణంగా చేసే పనితీరు మార్చుకోవాల్సి ఉంటుంది. లేదని మూసధోరణిలో ఉంటే వెనకబడి పోతాం. ఇప్పుడు ఇదే ఫార్ములా ఉద్యోగాల విషయంలో వర్తిస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మార్కెట్‌ రీసెర్చ్‌ ప్రకారం..ప్రస్తుతం ఉద్యోగులు ఎంపిక చేసుకుంటున్న ఉద్యోగాలకంటే.. ట్రెండింగ్‌లో ఉన్న పలు టెక్నాలజీలలో నిష్ణాతులైన ఉద్యోగుల కోసం ఆయా సంస్థలు అన‍్వేషిస్తున్నట్లు తేలింది.    

ప్రముఖ ఆన్‌లైన్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ లింక్డ్‌ఇన్‌ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ నివేదిక ఆధారంగా.. క్రిప్టోకరెన్సీ, బ్లాక్‌చెయిన్ రంగంలో పరిజ్ఞానం, నిపుణులైన అభ్యర్ధుల కోసం సంస్థలు వెతుకుతున్న ఉద్యోగాల జాబితా రోజురోజుకీ పెరిగిపోతున్నట్లు తేలింది. గతేడాది యూఎస్‌లో పై టెక్నాలజీ ఉద్యోగుల కోసం అన్వేషిస్తున్న శాతం  395పెరిగింది. ఇదే 2020తో పోలిస్తే 2021లో 5 రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు, సాధారణ సాంకేతిక రంగాల్లో ఉద్యోగ డిమాండ్ కేవలం 98శాతం పెరిగిందని లింక్డ్‌ఇన్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. 

జాబ్‌ డిస్క్రిప్షన్‌తో పాటు జాబ్‌ టైటిల్స్‌లో బిట్‌కాయిన్, ఎథెరియం, బ్లాక్‌చెయిన్, క్రిప్టోకరెన్సీ వంటి పదాల్ని జత చేస్తూ కంపెనీలు ఉద్యోగుల్నిఎంపిక చేసుకుంటున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో బే ప్రాంతం, టెక్సాస్‌లోని ఆస్టిన్, న్యూయార్క్ నగరం, మయామి ఫోర్ట్ లాడర్‌డేల్,డెన్వర్ ప్రాంతాల్లో క్రిప్టో టెక్నాలజీ జాబ్స్‌ అందించే ప్రధాన ప్రాంతాలుగా అవతరిస్తున్నాయి.

2020 నుంచి ట్రెండ్‌ మారింది
2020 నుంచి అమెరికాకు చెందిన పలు ప్రాంతాల్లో ఉద్యోగాల రూపకల్పన విషయంలో ట్రెండ్‌ మారినట్లు లింక్డ్‌ఇన్‌ తెలిపింది. 2020 నుంచి శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా, న్యూయార్క్ నగరం, నార్త్ కరోలినాలోని రాలీ డర్హామ్ చాపెల్ హిల్ ప్రాంతం, గ్రేటర్ ఫిలడెల్ఫియా, లాస్ ఏంజిల్స్ ప్రాంతాల్లో  క్రిప్టోకరెన్సీతో పాటు అందుకు అనుబంధంగా ఉన్న టెక్నాలజీలో ఉద్యోగ అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. గతంలో బ్లాక్‌చెయిన్ డెవలపర్‌లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లను ఎక్కువగా కోరుకోగా..సాఫ్ట్‌వేర్, ఫైనాన్స్ లీడింగ్‌లో ఉన్నట్లు తేలింది.

ఆ తర్వాత అకౌంటింగ్, కన్సల్టింగ్, స్టాఫింగ్, కంప్యూటర్ హార్డ్‌వేర్ డెవలప్‌మెంట్ కోసం నిపుణుల కోసం మరిన్ని ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. అయితే ఈ నేపథ్యంలో లింక్డిఇన్‌ నివేదిక ఆధారంగా మార్కెట్‌ నిపుణులు పలు అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. దేశం ఏదైనా, ప్రాంతం ఏదైనా అక్కడి పరిస్థితులకు తగ్గట్లు టెక్నాలజీలను ఫాలో అవ్వాలని సలహా ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు మార్కెట్‌ అవసరాల్ని అంచనా వేస్తూ..ఆయా టెక్నాలజీల్లో తర్ఫీదు పొందితే ఉద్యోగులు రాణిస్తారని సూచిస్తున్నారు.

చదవండి: 'రండి బాబు రండి', పిలిచి మరి ఉద్యోగం ఇస్తున్న దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు!   

>
మరిన్ని వార్తలు