విమానంలో స్మోకింగ్‌..పట్టుబడ్డాక వింతగా ప్రవర్తించిన ప్రయాణికుడు?

12 Mar, 2023 15:28 IST|Sakshi

విమానంలో అభ్యంతరకరంగా ప్రవర్తించడం, ఇతర ప్రయాణికులపై మూత్రవిసర్జన చేయడం, అడ్డుకున్న సిబ్బందిపై దాడికి పాల్పడుతున్న ఘటనలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అమెరికాలో నివసించే రమాకాంత్‌ అనే ప్రయాణికుడు ఎయిరిండియా విమానంలో వీరంగం సృష్టించాడు.

ఎయిరిండియాకు చెందిన ఓ విమానం లండన్‌ నుంచి ముంబైకి బయల్దేరింది. విమానం గాల్లో ఉండగా రమాకాంత్‌ బాత్రూంలో స్మోక్‌ చేశాడు. వద్దని వారించినా క్రూ సిబ్బంది, ఇతర ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ముంబై పోలీసులు తెలిపారు. 

ముంబై పోలీసులు తెలిపిన వివరాల మేరకు..విమానంలో స్మోకింగ్‌ చేయడం చట్టరిత్యా నేరం. అయినా నిబంధనల్ని ఉల్లంఘించిన రమాకాంత్‌.. ఎయిరిండియా విమానం టాయిలెట్‌లో ధూమపానం చేశాడు. అలారం మోగడంతో అప్రమత్తమైన సిబ్బంది సదరు ప్రయాణికుడి చేతిలో సిగరెట్‌ ఉండటాన్ని గమనించారు. విమానంలో స్మాకింగ్‌ చేయకూడదని వారించడంతో చేతిలో ఉన్న సిగరెట్‌ను పక్కకు విసిరేశాడు. 

విమానంలో జిమ్మిక్కులు
అనంతరం క్రూ సిబ్బందిపై గట్టిగా కేకలు వేస్తూ నానా హంగామా చేశాడు. అతన్ని నచ్చజెప్పిన సిబ్బంది తన సీట్లో కూర్చోబెట్టారు. కొద్ది సేపటికి విమానం గాల్లో ఉండగా అత్యవసర ద్వారాన్ని (emergency door) తెరిచేందుకు యత్నించాడు. దీంతో ప్రయాణికులు ప్రాణ భయంతో కేకలు వేయడంతో.. జిమ్మిక్కులతో వింతగా ప్రవర్తించాడు. మళ్లీ అరవడం మొదలు పెట్టాడు. తలను అటూ ఇటూ ఊపుతూ విమాన సిబ్బందిని, ప్రయాణికుల్ని భయాందోళనకు గురి చేశారు. ప్రయాణికుల్లో ఉన్న ఓ డాక్టర్‌ అతని ఆరోగ్యంపై ఆరా తీశాడు. అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా’ అని పరీక్షించాడు. అతని వద్ద ఎలాంటి మెడిసిన్‌ లభ్యం కాలేదు. ఈ - సిగరెట్‌ మాత్రమే ఉన్నట్లు ఎయిరిండియా క్రూ సిబ్బంది సహార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు
ఎయిరిండియా సిబ్బంది ఫిర్యాదుతో 37ఏళ్ల రమాకాంత్‌పై ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) సెక్షన్‌ 336 (ఇతరుల వ్యక్తిగత భద్రతకు హాని కలిగించేలా నిర్లక్ష్యంగా ప్రవర్తించడం), ఎయిర్‌ క్రాఫ్ట్‌ యాక్ట్‌ 1937,22 (పైలట్-ఇన్-కమాండ్ ఇచ్చిన చట్టబద్ధమైన సూచనలను నిరాకరిండం), 23 (దాడి, ఇతరుల భద్రతకు హాని,విధులకు భంగం కలిగించడం), 25 (ధూమపానం చేయడం) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

అనారోగ్య సమస్యలపై ఆరా
నిందితుడు భారతీయ సంతతికి చెందినవాడని, అయితే అమెరికా పౌరుడని గుర్తించేలా అమెరికా పాస్‌ పోర్ట్‌ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడా? లేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అని నిర్ధారించేందుకు వైద్య పరీక్షల కోసం నిందితుడి బ్లడ్‌ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపినట్లు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు