బ్రెడ్‌ మాత్రమే మిగిలింది.. మారుతి భార్గవ కీలక వ్యాఖ్యలు

30 Apr, 2022 15:17 IST|Sakshi

క్యూ4లో మారుతీ స్పీడ్‌ 

నికర లాభం 51 శాతం ప్లస్‌ 

షేరుకి రూ. 60 చొప్పున డివిడెండ్‌ 

రూ. 5,000 కోట్ల పెట్టుబడులు 

వాహన ఎగుమతుల్లో కొత్త రికార్డ్‌  

న్యూఢిల్లీ: చిన్న కార్లే మారుతీకి బ్రెడ్‌ అండ్‌ బటర్‌గా పేర్కొనే పరిస్థితులకు కాలం చెల్లినట్లు మారుతి సూజూకి చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ పేర్కొన్నారు. బటర్‌పోగా బ్రెడ్‌ మాత్రమే మిగిలినట్లు వ్యాఖ్యానించారు. నూతన నిబంధనలు, అధిక పన్నులు, కమోడిటీ ధరలు ఎంట్రీలెవల్‌ కార్ల ధరలు పెరిగేందుకు కారణమైనట్లు తెలియజేశారు. దీంతో హ్యాచ్‌ బ్యాక్‌ విక్రయాలు క్షీణిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రెండ్‌ మారిందని, మార్కెట్‌ పరిస్థితులకు తగినట్లుగా కంపెనీ సైతం వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నట్లు వెల్లడించారు. వెరసి మారుతీ పెద్ద కార్లతోపాటు, ఎస్‌యూవీలను సైతం ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. 

క్యూ 4 ఫలితాల్లో
కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 51 శాతం జంప్‌చేసి రూ. 1,876 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 1,241 కోట్లు ఆర్జించింది. సెమీకండక్టర్ల కొరత ఉత్పత్తిని దెబ్బతీసినప్పటికీ కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 24,034 కోట్ల నుంచి రూ. 26,749 కోట్లకు ఎగసింది. వాటాదారులకు షేరుకి రూ. 60 చొప్పున డివిడెండును ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో రూ. 5,000 కోట్లకుపైగా పెట్టుబడి వ్యయాలకు తెరతీయనున్నట్లు మారుతీ సుజుకీ వెల్లడించింది. దీనిలో భాగంగా మనేసర్‌ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష యూనిట్లమేర విస్తరించనున్నట్లు సీఎఫ్‌వో అజయ్‌ సేథ్‌ పేర్కొన్నారు. ప్రస్తుత వార్షిక సామర్థ్యం 8 లక్షల వాహనాలు.  

వాహన అమ్మకాలు డీలా 
ఈ క్యూ4లో మారుతీ వాహన విక్రయాలు స్వల్ప వెనకడుగుతో 4,88,830 యూనిట్లకు చేరాయి. వీటిలో దేశీ అమ్మకాలు 8 శాతం క్షీణించి 4,20,376 యూనిట్లకు పరిమితమయ్యాయి. అయితే రికార్డు సృష్టిస్తూ 68,454 యూనిట్లను ఎగుమతి చేసింది. ఒక త్రైమాసికంలో ఇవి అత్యధికమని కంపెనీ పేర్కొంది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్‌ నికర లాభం 12 శాతం తగ్గి రూ. 3,880 కోట్లకు పరిమితమైంది. 2020–21లో రూ. 4,389 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 70,372 కోట్ల నుంచి రూ. 88,330 కోట్లకు ఎగసింది. మొత్తం వాహన అమ్మకాలు 13 శాతంపైగా పుంజుకుని 16,52,653 యూనిట్లను తాకాయి. వీటిలో దేశీ విక్రయాలు 4 శాతం బలపడి 14,14,277 యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా.. గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 2,38,376 వాహనాలను ఎగుమతి చేసింది. 2020–21లో ఎగుమతైన వాహనాలు 96,139 మాత్రమే. 

చిప్‌ల కొరత 
కోవిడ్‌–19, కమోడిటీల ధరలు, చిప్‌ల కొరత వంటి సమస్యలతో గతేడాది సవాళ్లు విసిరినట్లు మారుతీ చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ పేర్కొన్నారు. ఎల్రక్టానిక్‌ విడిభాగాల కొరత కారణంగా గతేడాది 2.7 లక్షల వాహనాల ఉత్పత్తికి విఘాతం కలిగినట్లు మారుతీ అంచనా వేసింది. ప్రధానంగా దేశీ మోడల్స్‌కు ఇబ్బంది ఎదురైనట్లు పేర్కొంది. దీంతో 2.68 లక్షల వాహనాలకు కస్టమర్ల బుకింగ్స్‌ పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించింది. వాహన ధరలను పెంచడం ద్వారా స్టీల్, అల్యూమినియం తదితర కమోడిటీల పెరుగుదలను కొంతమేర ఎదుర్కోగలిగినట్లు వివరించింది.  
చదవండి: మెర్సిడెస్‌ బెంజ్‌ @ మేడ్‌ ఇన్‌ ఇండియా!

మరిన్ని వార్తలు