Yadadri Temple: ‘మేఘా’ 6 కిలోల బంగారం

21 Oct, 2021 02:31 IST|Sakshi
పసిడి రంగులో కనిపిస్తున్న యాదాద్రి ప్రధానాలయ విమాన గోపురం (నమూనా చిత్రం)

స్వర్ణ తాపడానికి కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్, ప్రణీత్‌ గ్రూప్‌ 2 కిలోల చొప్పున విరాళం

సాక్షి, హైదరాబాద్‌/యాదాద్రి: యాదాద్రి దేవాలయం విమాన గోపురానికి బంగారు తాపడం చేసేందుకు బంగారాన్ని విరాళంగా ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన విజ్ఞప్తికి మంచి స్పందన లభిస్తోంది. రెండ్రోజుల వ్యవధిలోనే పలువురు ప్రముఖులు సుమారు 32 కిలోల బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ తరఫున ఆరు కిలోల బంగారం విరాళంగా ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ బి.శ్రీనివాస్‌రెడ్డి బుధవారం తెలిపారు. ఆరు కేజీల బంగారం లేదా సమానమైన మొత్తాన్ని చెక్కు రూపంలో త్వరలో అందజేస్తామని ప్రకటించారు.

ప్రతిష్టాత్మక పుణ్యస్థలమైన యాదాద్రి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచల మేరకు మరింత అందంగా రూపుదిద్దుకుని, దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారుతుందని ఆయన ఆకాంక్షించారు. ఇలావుండగా సీఎం కేసీఆర్‌ స్ఫూర్తితో యాదాద్రి విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం రెండు కిలోల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రణీత్‌ గ్రూప్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నరేంద్ర కుమార్‌ కామరాజు తెలిపారు. అలాగే కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ఎండీ కామిడి నర్సింహారెడ్డి సంస్థ తరఫున 2 కిలోల బంగారాన్ని, ప్రముఖ వ్యాపారవేత్త ఎన్‌వీ రామరాజు తమ సంస్థ (జలవిహార్‌) తరఫున కిలో బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. 

విరాళాల కోసం బ్యాంక్‌ ఖాతా 
స్వర్ణ తాపడానికి భక్తులు విరాళాలు సమర్పించడానికి బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ను దేవస్థానం ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఇండియన్‌ బ్యాంక్‌ యాదగిరిగుట్ట శాఖలో ఖాతా తెరిచారు. దాతలు అకౌంట్‌ నం. 6814884695, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఐడీఐబీ000వై011కు నగదు జమ చేయాలని దేవస్థానం ఈఓ గీతారెడ్డి కోరారు. విరాళాలు పారదర్శకంగా ఉండేందుకు బ్యాంక్‌ ద్వారానే తీసుకోనున్నామని తెలిపారు. బంగారం విరాళంగా ఇస్తే స్వచ్ఛత విషయంలో తేడాలు ఉండే అవకాశం ఉన్నందున భక్తులు నగదు రూపంలో బ్యాంకులో జమచేయాలని సూచించారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు