వృద్ధి, ద్రవ్యోల్బణం రానున్న బడ్జెట్‌ లక్ష్యాలపై నిర్మలా సీతారామన్‌

13 Oct, 2022 06:16 IST|Sakshi
అమెరికా ఆర్థికమంత్రి జనెత్‌ యెల్లెన్‌తో నిర్మలా సీతారామన్‌

ఆర్థికమంత్రి  సీతారామన్‌ వెల్లడి

ప్రతిష్టాత్మక బ్రూకింగ్స్‌ ఇన్‌సిట్యూట్‌లో ప్రసంగం

అమెరికా ఆర్థికమంత్రి జనెత్‌ యెల్లెన్‌తోటీ భేటీ  

వాషింగ్టన్‌: ఆర్థికాభివృద్ధి, ద్రవ్యోల్బణం కట్టడే 2022-23 వార్షిక బడ్జెట్‌ (2023 ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో సమర్పించే అవకాశం) లక్ష్యాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.  ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) వార్షిక సమావేశాల్లో పాల్గొనడానికిగాను ఆరు రోజుల అమెరికా పర్యటనకు వచ్చిన నిర్మలా సీతారామన్‌ మొదటిరోజు-మంగళవారం వాషింగ్టన్‌ డీసీలో బిజీబిజీగా గడిపారు. అమెరికా ఆర్థికమంత్రి జనెత్‌ యెల్లెన్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో భేటీ,  ప్రతిష్టాత్మక బ్రూకింగ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఆర్థికవేత్తలు, వ్యాపారవేత్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఇందులో ఉన్నాయి. బ్రూకింగ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కార్యక్రమంలో ప్రముఖ ఆర్థికవేత్త ఈశ్వర్‌ ప్రసాద్‌సహా పలువురు నిపుణుల అడిగిన ప్రశ్నలకు ఆమె సవివరంగా సమాధానాలు ఇచ్చా రు.  ఆమె ప్రసంగంలో మరిన్ని ముఖ్యాంశాలు..

► భారత్‌ ఎకానమీ సమీప భవిష్యత్తులో ఎదుర్కొనబోయే ప్రధాన సవాళ్లలో అధిక ఇంధన ధరలు ఒకటి.  
► మహమ్మారి సవాళ్ల నుంచి సమర్థవంతంగా బయటపడిన భారత్‌ అటు వృద్ధి-ఇటు ద్రవ్యోల్బణాన్ని సమర్థవంతంగా సమతౌల్యం చేయగలుగుతోంది. ఇది గమనించడం చాలా ముఖ్యం.  
► భారత్‌ దేశ ఆర్థిక వ్యవస్థను గమనిస్తున్న పలు రేటింగ్, విశ్లేషణా, ఆర్థిక సంస్థలు కూడా భారత్‌ ఎకానమీ బలహీనపడలేదన్న విషయాన్ని గుర్తిస్తున్నాయి.  
► ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి వల్ల ఇంధనం, ఎరువులు, ఆహార రంగాలకు సంబంధించిన సవాళ్లను భారత్‌ ఎదుర్కొంటోంది. వీటన్నింటినీ భారత్‌  జాగ్రత్తగా గమనిస్తోంది. 
► అంతర్జాతీయ ఒత్తిళ్లు ప్రజలకు చేరకుండా చూసుకుంటున్నాము. ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించడం వల్ల ఇంధన ధరల పెరుగుదల భారం సామాన్య ప్రజలపై పడ్డం లేదు.  
► రూపాయిని తమ దేశాల్లో ఆమోదయోగ్యంగా మార్చేందుకు వివిధ దేశాలతో భారత్‌ చర్చలు జరుపుతోంది.  
► యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌), బీహెచ్‌ఐఎం యాప్, ఎన్‌సీపీఐ  (నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) అన్నీ ఇప్పుడు ఆయా దేశాల్లో వ్యవస్థలతో కలిసి పటిష్టంగా పనిచేయడానికి తగిన ప్రయత్నం జరుగుతోంది. మన వ్యవస్థకు ఇంటర్‌–ఆపరేటబిలిటీ కూడా ఆ దేశాల్లోని భారతీయుల నైపుణ్యానికి బలాన్ని ఇస్తుంది.


బ్రూకింగ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో  ప్రముఖ ఆర్థికవేత్త ఈశ్వర్‌ ప్రసాద్‌తో ఆర్థికమంత్రి 

మరిన్ని వార్తలు