కేజీ–డీ6 గ్యాస్‌ కోసం గట్టి పోటీ

14 May, 2021 04:21 IST|Sakshi

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్య సంస్థ బీపీకి చెందిన కేజీ–డీ6 బ్లాక్‌లో ఉత్పత్తి చేసే గ్యాస్‌ కోసం ఇటీవల నిర్వహించిన వేలంలో బిడ్డింగ్‌ తీవ్ర స్థాయిలో జరిగింది. దాదాపు 14 సంస్థలు సుమారు ఏడున్నర గంటల పాటు బిడ్డింగ్‌లో పాల్గొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్, గెయిల్‌ గ్యాస్, అదానీ టోటల్, టోరెంట్‌ గ్యాస్, షెల్, ఐజీఎస్‌ తదితర సంస్థలతో పాటు రిలయన్స్‌కి చెందిన ఓ2సీ వ్యాపార విభాగం వీటిలో ఉన్నాయి. కేజీ–డీ6 బ్లాక్‌లోని కొత్త క్షేత్రాల నుంచి అదనంగా ఉత్పత్తి చేసే సహజ వాయువుకు సంబంధించి మే 5న ఈ వేలం నిర్వహించారు. 3–5 ఏళ్ల పాటు రోజుకు 5.5 మిలియన్‌ ప్రామాణిక ఘనపు మీటర్ల  (ఎంసీఎండీ) గ్యాస్‌ను వేలం వేశారు. అంతిమంగా రిలయన్స్‌ ఓ2సీ అత్యధికంగా 3.2 ఎంసీఎండీ గ్యాస్‌ను దక్కించుకుంది.

రిలయన్స్‌–బీపీ జాయింట్‌ వెంచర్‌ సంస్థ ఐజీఎస్‌ 1 ఎంసీఎండీ, అదానీ గ్యాస్‌ 0.15 ఎంసీఎండీ, ఐఆర్‌ఎం ఎనర్జీ 0.10 ఎంసీఎండీ, గెయిల్‌ (రోజుకు 30,000 ఘనపు మీటర్లు), టోరెంట్‌ గ్యాస్‌ (రోజుకు 20,000 ఘనపు మీటర్లు) మిగతా సహజ వాయువును దక్కించుకున్నాయి. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హైడ్రోకార్బన్స్‌ (డీజీహెచ్‌) ఆమోదించిన థర్డ్‌ పార్టీ స్వతంత్ర ప్లాట్‌ఫాంపై రిలయన్స్‌–బీపీ గ్యాస్‌ వేలం నిర్వహించడం ఇది మూడోసారి. క్రిసిల్‌ రిస్క్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సొల్యూషన్స్‌ (క్రిస్‌) రూపొందించిన ఈ ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ ప్లాట్‌ఫాంను ఈ ఏడాది ఫిబ్రవరితో పాటు 2019లో నిర్వహించిన వేలానికి కూడా ఉపయోగించారు. కేజీ–డీ6 బ్లాక్‌లోని కొత్త క్షేత్రాలకు సంబంధించి 3 విడతలుగా నిర్వహించిన వేలంలో రిలయన్స్‌–బీపీ మొత్తం 18 ఎంసీఎండీ గ్యాస్‌ విక్రయించింది.

మరిన్ని వార్తలు