గుడ్‌ న్యూస్‌: భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు..ఎప్పటి నుంచంటే!

22 Apr, 2022 21:39 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతీ గ్రూపు ప్రధాన వాటాదారుగా ఉన్న ‘వన్‌ వెబ్‌’ ఇస్రో వాణిజ్య కంపెనీ అయిన ‘న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌’తో ఒప్పందం చేసుకుంది. దీంతో వన్‌వెబ్‌ తన శాటిలైట్ల విడుదల కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనుంది. న్యూ స్పేస్‌ ఇండియాతో కలసి వన్‌వెబ్‌ మొదటి శాటిలైట్‌ లాంచ్‌ కార్యక్రమం 2022లోనే శ్రీహరికోటలోని షార్‌ నుంచి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

శాటిలైట్‌ నెట్‌వర్క్‌ అభివృద్ధికి, సురక్షితమైన అనుసంధానాన్ని కల్పన కోసం పనిచేస్తున్నట్టు వన్‌వెబ్‌ ప్రకిటించింది. అంతరిక్ష రంగంలో సహకారానికి మరొక చరిత్రాత్మక రోజుగా పేర్కొంది.‘‘శాటిలైట్ల ఆవిష్కరణ విషయంలో తాజా ఒప్పందం, వన్‌వెబ్‌ నెట్‌ అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. అంతర్జాతీయంగా కమ్యూనిటీలను అనుసంధానించాలన్న మా ఉమ్మడి లక్ష్యాన్ని సాధించేందుకు అంతరిక్షం రంగంలో మేము కలసి పనిచేస్తాం’’అని వన్‌వెబ్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌ తెలిపారు. 

కజకిస్థాన్‌లో రష్యా నిర్వహించే బైకోనర్‌ కాస్మోడ్రోన్‌ నుంచి శాటిలైట్ల ఆవిష్కరణను నిలిపివేస్తున్నట్టు వన్‌వెబ్‌ ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన నేపథ్యంలో తాజా ఒప్పందం కుదరడం గమనార్హం. శాటిలైట్లు, టెక్నాలజీని సైనిక అవసరాలకు వినియోగించబోమంటూ హామీ ఇవ్వాలని రష్యా స్పేస్‌ ఏజెన్సీ రాస్‌కాస్మోస్‌ కోరడమే ఈ నిర్ణయం వెనుక కారణం. తక్కువ కక్ష్యలో పరిభ్రమించే శాటిలైట్ల సాయంతో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించే సంస్థే వన్‌వెబ్‌. మారుమూల ప్రాంతాలకు సైతం వేగవంతమైన నెట్‌ సేవలు అందించొచ్చు. ఈ కంపెనీలో భారతీ గ్రూపు పెద్ద వాటాదారుగా ఉండగా, బ్రిటన్‌ ప్రభుత్వానికి సైతం వాటాలున్నాయి.   

భారత్‌లో వన్‌వెబ్‌కు లైసెన్స్‌ 
భారత్‌ మార్కెట్లో శాటిలైట్‌ సేవలు అందించేందుకు వన్‌వెబ్‌ కేంద్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్‌ సంపాదించింది. గ్లోబల్‌ మొబైల్‌ పర్సనల్‌ కమ్యూనికేషన్‌ బై శాటిలైట్‌ (జీఎంపీసీఎస్‌) లైసెన్స్‌ను వన్‌వెబ్‌కు టెలికం శాఖ మంజూరు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 2022 మధ్య నుంచి భారత్‌ మా ర్కెట్లో సేవలు అందించాలన్న వన్‌వెబ్‌ లక్ష్యం తాజా లైసెన్స్‌ రాకతో సాకారం కానుంది.

చదవండి👉 భారతీయులకు శుభవార్త..! 'జియో' కంటే తక్కువ ధరకే శాటిలైట్‌ ఇంటర్నెట్‌..!

మరిన్ని వార్తలు