భారత్‌లో అవకాశాలు అపారం

25 May, 2023 05:07 IST|Sakshi

ఇన్‌ఫ్రా, సెమీకండక్ట్టర్, ఇంధన రంగాల్లో ఇన్వెస్ట్‌ చేయండి

ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలకు పీఎం మోదీ పిలుపు

సిడ్నీ: భారత్‌లో డిజిటల్‌ ఇన్‌ఫ్రా, టెలికం, సెమీ కండక్టర్లలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా అక్కడి ప్రముఖ కంపెనీల సీఈవోలతో  ప్రధాని ఓ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా భారత్‌లో అవకాశాల గురించి తెలియజేశారు. మౌలిక సదుపాయాలు, డిజిటల్‌ ఇన్‌ఫ్రా, ఐటీ, ఫిన్‌టెక్, టెలికం, సెమీకండ్టర్, అంతరిక్షం, పునరుత్పాదక ఇంధన వనరులు, గ్రీన్‌ హైడ్రోజన్, విద్య, ఫార్మా, హెల్త్‌కేర్, వైద్య ఉపకరణాల తయారీ, మైనింగ్, టెక్స్‌టైల్, వ్యవసాయం, ఆహార శుద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి తెలిపారు.

భారతీయ కంపెనీలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. టెక్నాలజీ, నైపుణ్యాలు, శుద్ధ ఇంధనాల విషయంలో భారత కంపెనీలతో సహకారం ఇతోధికం చేసుకోవాలని కోరారు. నిబంధనల అమలును సులభతరం చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. పీఎల్‌ఐ ప్రోత్సాహకాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సరళతరం చేసినట్టు వివరించారు.

హాన్‌కాక్‌ ప్రాస్పెక్టింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ గినా రైన్‌హార్ట్, ఫార్టెస్క్యూ ఫ్యూచర్‌ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ ఆండ్య్రూ ఫారెస్ట్, ఆస్ట్రేలియా సూపర్‌ సీఈవో పౌల్‌ ష్రోడర్‌ ప్రధానితో సమావేశంలో పాల్గొన్నారు. 2000 ఏప్రిల్‌ నుంచి 2022 డిసెంబర్‌ వరకు ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు 1.07 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరు దేశాలు మధ్యంతర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడం తెలిసిందే. గతేడాది డిసెంబర్‌ 29 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. భారత్‌కు ఆస్ట్రేలియా 13వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది.

మరిన్ని వార్తలు