ఇంటర్‌పోల్‌ నిర్ణయం: చోక్సీకి విముక్తి లభించినట్టేనా? 

21 Mar, 2023 12:07 IST|Sakshi

సాక్షి,ముంబై: పీఎన్‌బీలో రూ. 13,000 కోట్ల మోసానికి పాల్పడి భారతదేశంనుంచి పారిపోయిన మెహుల్ చోక్సీ పేరును మోస్ట్‌ వాంటెడ్‌ లిస్ట్‌ నుంచి తొలగించడం సంచలనం సృష్టించింది. ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు నుంచి మెహుల్ చోక్సీని ఎందుకు తొలగించారనేది చర్చనీయాంశంగా మారింది.

చోక్సీ లాయర్‌  ఏమన్నారంటే?
తన క్లయింట్‌ (మెహుల్ చోక్సీ) వ్యతిరేకంగా జారీ అయిన ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసు విత్‌ డ్రా చేసిందని, ఇది సంతోషించ దగ్గ పరిణామమని చోక్సీ న్యాయవాది విజయ్ అగర్వాల్ ప్రకటించారు. లీగల్ టీమ్ ఇంటర్‌పోల్‌తో విచారణ జరుపుతోంది. తాజా నిర్ణయంతో ఇపుడు అతను భారతదేశం మినహా ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరగొచ్చని, ఇది ఇండియాలో అతనిపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ వ్యాజ్యాన్ని ప్రభావితం చేయదని కూడా ప్రకటించారు. (పీఎన్‌బీ స్కాం: చోక్సీపై రెడ్‌ కార్నర్‌ నోటీసు ఎత్తివేత కలకలం)

ఇంటర్‌పోల్‌ నిర్ణయం ప్రభావితం  చేయదు
మరోవైపు మెహుల్ చోక్సీకి వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసు (ఆర్‌సిఎన్) రద్దు కేసును ప్రభావితం చేయదని కేంద్రం ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.ఈ కేసు ఇప్పటికే అధునాతన దశలో ఉందని  చోక్సీ అరెస్టు తర్వాత  తదుపరి చర్యలు  తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్‌ఐ నివేదించింది.

అసలు ఏం జరిగింది?
సంచలన పీఎన్‌బీ స్కాంలో ప్రధాన నిందితుడిగా విదేశాలకు చెక్కేసిన మెహుల్చోక్సీని ఇంటర్‌పోల్ డేటాబేస్ ఆఫ్ రెడ్ నోటీసుల నుంచి ఉపసంహరించుకుందనేది ఇపుడు  హాట్‌ టాపిక్‌.  తనపై కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారని వాదించి చోక్సీ, సీబీఐ  చార్జ్‌షీటు, రెడ్‌ కార్నర్‌ నోటీసులపై సీబీఐ అభ్యర్థనను సవాల్‌ చేస్తూ  లియోన్ హెడ్‌క్వార్టర్స్ ఏజెన్సీకి అప్పీల్‌ చేశాడు.  ఈ ఫిర్యాదు మేరకు ఇంటర్‌పోల్ ఐదుగురు సభ్యుల కమిటీ ఈ కేసును పరిశీలించింది. ముఖ్యంగా డొమినికాలో చోక్సీని కిడ్నాప్ చేసినట్లు వార్తలు వెలువడిన తర్వాత భారతదేశంలో న్యాయమైన విచారణ జరగక పోవచ్చని కమిటీ తెలిపింది.  ఈ కేసు రాజకీయ కుట్ర ఫలితమని పేర్కొంది.

హిందూస్తాన్ టైమ్స్ రిపోర్ట్‌ ప్రకారం, ఇంటర్‌పోల్ ఇలా ప్రకటించింది. చోక్సీని ఆంటిగ్వా నుండి డొమినికాకు కిడ్నాప్‌ చేయడంలో అంతిమ ఉద్దేశ్యం ఇండియాకు రప్పించడమేనని వ్యాఖ్యానించింది. అలాగే చోక్సిని ఇండియాకు తరలిస్తే.. ఈ కేసులో న్యాయమైన విచారణ లేదా అనారోగ్యంతో ఉన్న చోక్సి సరియైన చికిత్స పొందే  అవకాశం  ఉండకపోవచ్చని పేర్కొంది. 

>
మరిన్ని వార్తలు