ఉంటుందో..? ఊడుతుందో..?

22 Dec, 2023 11:16 IST|Sakshi

అభివృద్ధి చెందుతున్న సాంకేతికలు (ఎమర్జింగ్​ టెక్నాలజీలు) కొందరికి మేలు చేస్తుంటే.. మరికొంత మంది వర్కింగ్​ ప్రొఫెషనల్స్ ​వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. వీటి కారణంగా తామ ఉద్యోగం ఉంటుందో.. పోతుందోనని ఆందోళన చెందుతున్నారు. మెజారిటీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల గురించి టెన్షన్​ పడుతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. వేగంగా మారుతున్న ఐటీ రంగంలో నిలదొక్కుకోవాలంటే ఏఐ వంటి ఎమర్జింగ్​ టెక్నాలజీల్లో నైపుణ్యాలు సాధించాల్సిందేనని తాజా నివేదిక చెబుతోంది.

హీరో గ్రూప్​ కంపెనీ హీరో వైర్డ్​ అనే కమ్యునిటీ ద్వారా రెండు లక్షల మంది విద్యార్థులు, వర్కింగ్​ ప్రొఫెషనల్స్‌పై​ సర్వే చేసి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల కారణంగా ఉద్యోగాల తొలగింపు ఎక్కువగా ఉంటుందని 82 శాతం మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమర్జింగ్​ టెక్నాలజీల ప్రభావం గురించి శ్రామిక శక్తిలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. అయితే 78 శాతం మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ వేగంగా మారుతున్న పని విధానానికి అనువుగా మారడానికి నైపుణ్యాలు పెంచుకోవడం తప్పనిసరని అంగీకరించారు. 

ఇదీ చదవండి: మరింత ప్రమాదకరంగా 2024..?

గతేడాది చివరిలో ప్రారంభమైన చాట్‌జీపీటీ ఆధ్వర్యంలోని జనరేటివ్‌ ఏఐ ప్రభావం ఉద్యోగాలపై తీవ్రం ఉందని, కార్పొరేట్‌ రంగంలో పెనుమార్పునకు అది దోహదపడనుందని చాలా మంది ప్రొఫెషనల్స్‌ భావిస్తున్నారు. ముఖ్యంగా 90% మంది రాబోయే ఐదేళ్లలో ఏఐ నిపుణులకు అత్యంత డిమాండ్ ఉండనుందని అంచనా వేస్తున్నారు. అందులో 80% మంది ఉద్యోగులకు అధికంగా జీతభత్యాలు ఉండనున్నాయిని తెలిపారు.

గోల్డ్‌మన్ శాక్స్ నివేదిక 

పలు రంగాల్లోని ఉద్యోగులను జనరేటివ్‌ ఏఐ టెక్నాలజీ భర్తీ చేస్తుందనే వాదనలూ గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో ఇటీవల గ్లోబల్ పెట్టుబడుల సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ నివేదిక వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఏర్పాడుతున్న మార్పుల కారణంగా కొద్ది ఏళ్లలోనే దాదాపు 30 కోట్ల ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని అంచనా వేసింది. లేబర్ మార్కెట్‌పై భారీ ప్రభావం ఉండనుందని పేర్కొంది. ప్రపంచ దేశాల్లో మూడింట రెండోంతుల ఉద్యోగాలు ఆటోమేటెడ్‌గా మారిపోనున్నాయని తెలిపింది.

>
మరిన్ని వార్తలు