కోటక్, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకులకు ఆర్బీఐ షాక్‌!

6 Jul, 2022 07:22 IST|Sakshi

ముంబై: కోటక్‌ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రూ.కోటి చొప్పున జరిమానా విధించింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించకపోవడం దీనికి కారణమని పేర్కొంది. నాలుగు సహకార బ్యాంకులపై కూడా జరిమానాను విధించినట్లు సెంట్రల్‌ బ్యాంక్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌ ఫండ్‌ స్కీమ్, 2014కి సంబంధించిన కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకు అలాగే  కస్టమర్‌ ప్రొటెక్షన్‌ బాధ్యతలకు సంబంధించి ఆదేశాలను పాటించనందుకు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌పై రూ. 1.05 కోట్ల పెనాల్టీ విధించినట్లు ప్రకటన పేర్కొంది.

నిర్దిష్ట నో యువర్‌ కస్టమర్‌ (కేవైసీ) నిబంధనలను పాటించనందుకు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌పై రూ. 1 కోటి జరిమానా విధించినట్లు వివరించింది. నవ్‌ జీవన్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్, బలంగీర్‌ జిల్లా సెంట్రల్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్, ధాకురియా కోఆపరేటివ్‌ బ్యాంక్‌  (కోల్‌కతా), ది పళని కో–ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌పై రూ.1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకూ జరిమానా విధించినట్లు తెలిపింది.  
 

మరిన్ని వార్తలు