అందరికీ వృద్ధి ఫలాలు అందడమే అసలైన అభివృద్ధి

9 Jul, 2022 06:24 IST|Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: సమ్మిళిత వృద్ధి (అందరికీ వృద్ధి ఫలాలు చేరేలా) లేకుండా అసలైన వృద్ధి సాధ్యపడదని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు ఈ దిశగా తీసుకున్నట్టు చెప్పారు. తొలిసారిగా అరుణ్‌జైట్లీ స్మారక ఉపన్యాసం ఇచ్చారు. ప్రైవేటు రంగాన్ని వృద్ధిలో భాగస్వామిగా చూస్తున్నట్టు చెప్పారు. సమ్మిళిత వృద్ధి కోసం తీసుకున్న చర్యలను వివరిస్తూ.. ‘‘9 కోట్ల ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేశాం. 10 కోట్ల టాయిలెట్లను ప్రభుత్వం నిధులతో నిర్మించాం.

45 కోట్ల బ్యాంకు ఖాతాలను పేదల కోసం తెరిచాం. 2014కు ముందు పదేళ్లలో 50 వైద్య కళాశాలలు ఏర్పాటు కాగా, గత 7–8 ఏళ్లలో 209 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభమయ్యాయి’’అని చెప్పారు. భారత్‌ తప్పనిసరి అయి సంస్కరణలు చేపట్టడం లేదని స్పష్టం చేస్తూ.. తదుపరి 25 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని దృఢ విశ్వాసంతో అమలు చేస్తున్నట్టు తెలిపారు. సంస్కరణలు అందరికీ ఫలాలను ఇస్తాయన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, సీనియర్‌ బీజేపీ నేత అయిన అరుణ్‌జైట్లీకి ప్రధాని నివాళులు అర్పించారు.

మరిన్ని వార్తలు