కొత్త ఏడాదిలో..కొత్త ఉత్సాహంతో..మళ్లీ రెలిగేర్‌ ఫిన్‌వెస్ట్‌ షురూ!

28 Dec, 2022 19:00 IST|Sakshi

 న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశమున్నట్లు రుణ సంక్షోభంలో చిక్కుకున్న రెలిగేర్‌ ఫిన్‌వెస్ట్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌ఎల్‌) భావిస్తోంది. రూ. 2,300 కోట్ల వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌) ప్రతిపాదనకు రుణదాతలలో అత్యధిక శాతం సానుకూలంగా స్పందించడం ఇందుకు సహకరించనున్నట్లు అభిప్రాయపడుతోంది.

 ఓటీఎస్‌ ప్రక్రియ పూర్తయితే ఆర్‌ఎఫ్‌ఎల్‌ దిద్దుబాటు చర్యల ప్రణాళిక(సీఏపీ) నుంచి బయటపడే వీలుంది. కంపెనీ ఆర్థిక పరిస్థితి క్షీణించిన నేపథ్యంలో ఆర్‌బీఐ 2018 జనవరిలో సీఏపీకి తెరతీసిన సంగతి తెలిసిందే. ఓటీఎస్‌ ఒప్పందంపై 16 రుణదాత సంస్థలలో 14 సంస్థలు సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోగా మిగిలిన రెండు సంస్థలు సైతం అంగీకరించే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

 రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ఎన్‌బీఎఫ్‌సీ ఆర్‌ఎఫ్‌ఎల్‌.. ఎస్‌బీఐ అధ్యక్షతన ఏర్పాటైన రుణదాతల కన్సార్షియంకు రూ. 5,300 కోట్లు బకాయి పడింది. ప్రతిపాదిత ఓటీఎస్‌ ప్రకారం 2022 జూన్‌లో కంపెనీ సెక్యూరిటీగా రూ. 220 కోట్లు డిపాజిట్‌ చేసింది. ఈ బాటలో ఓటీఎస్‌ సొమ్ము చెల్లించేందుకు కంపెనీ సంసిద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వెరసి 2023లో కంపెనీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డాయి. 

మరిన్ని వార్తలు