పండుగ సీజన్‌ టేకాఫ్‌ అదిరింది

4 Nov, 2020 04:25 IST|Sakshi

అంచనాలను మించి అమ్మకాలు 

దీపావళికీ ఇదే స్థాయి విక్రయాలు 

అంచనా వేస్తున్న రిటైల్‌ పరిశ్రమ 

సాక్షి, హైదరాబాద్: కోవిడ్‌–19 నేపథ్యంలో జూలై వరకు రిటైల్‌ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులను చవిచూసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో ఆగస్టు నుంచి క్రమంగా మార్కెట్‌లో కదలిక వచ్చింది. ఏడాదిలో 30–40 శాతం దాకా విక్రయాలను అందించే పండుగల సీజన్‌ ఈసారి మహమ్మారి కారణంగా ఎలా ఉంటుందో అన్న ఆందోళన వర్తకుల్లో వ్యక్తం అయింది. అయితే అందరి అంచనాలను మించి ఆఫ్‌లైన్లోనూ అమ్మకాలు జరగడం మార్కెట్‌ను ఆశ్చర్యపరిచింది. సెప్టెంబర్‌ నుంచి పుంజుకున్న సేల్స్‌కు ఫెస్టివ్‌ జోష్‌ తోడైంది. దీంతో దసరాకు ప్రధానంగా మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్, అపారెల్, ఆటోమొబైల్‌ వంటి రంగాలు మెరిశాయి. దసరా టేకాఫ్‌ అదిరిందని, దీపావళికి సైతం ఈ ట్రెండ్‌ కొనసాగుతుందని మార్కెట్‌ వర్గాలు ధీమాగా ఉన్నాయి.  

పెరిగిన నగదు కొనుగోళ్లు.. 
ఆన్‌లైన్‌ క్లాసుల మూలంగా పట్టణాలకు ధీటుగా గ్రామీణ ప్రాంతాల్లోనూ మొబైల్స్‌ విక్రయాలు సాగాయి. కొత్త మోడళ్ల రాక జోష్‌ను నింపింది. మహమ్మారి కారణంగా పండగల సీజన్‌లోనూ మందగమనం ఉంటుందని భావించామని సెల్‌ పాయింట్‌ ఎండీ పి.మోహన్‌ ప్రసాద్‌ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ‘గతేడాదితో పోలిస్తే ఈ దసరాకు మొబైల్‌ ఫోన్ల విక్రయాలు 5 శాతం వృద్ధి సాధించాయి. ఈఎంఐల వాటా సగానికి తగ్గి 25 శాతానికి వచ్చింది. అయినప్పటికీ కస్టమర్లు నగదుతో కొనుగోళ్లు జరిపారు. నగదు కొనుగోళ్లు 15 నుంచి 40 శాతానికి చేరాయి. దీపావళి సేల్స్‌ 10 శాతం వృద్ధి ఆశిస్తున్నాం’ అని చెప్పారు.  

ధర పెరగకపోవడంతో.. 
ప్యానెళ్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల ధర 5–7 శాతం వరకు అధికమవుతుందని అందరూ భావించారు. ఈ సీజన్లో ధర పెరగకపోవడం కస్టమర్లకు ఊరటనిచ్చింది. సెప్టెంబర్‌ వరకు వీటి విక్రయాలు పరిశ్రమలో 50 శాతమే. గతేడాదితో పోలిస్తే దసరాకు 90 శాతం సేల్స్‌ జరిగాయని సోనోవిజన్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ పి.భాస్కర మూర్తి తెలిపారు. దీపావళి గతేడాది స్థాయిలో ఉంటుందని అన్నారు. కంపెనీలు క్యాష్‌ బ్యాక్, బహుమతులు, ఇతర ఆఫర్లను అందిస్తున్నాయని వివరించారు. దిగుమతులపై ఆధారపడ్డ చాలా మోడళ్ల కొరత ఉందని వెల్లడించారు. అటు వస్త్ర పరిశ్రమ 90 శాతం వరకు పుంజుకుందని సమాచారం. వివాహాలు కూడా ఉండడంతో డిసెంబర్‌ దాకా మార్కెట్‌ సానుకూలంగా కొనసాగుతుందని లినెన్‌ హౌజ్‌ డైరెక్టర్‌ వొజ్జ తిరుపతిరావు అన్నారు.  

దూసుకెళ్లిన వాహనాలు.. 
అక్టోబర్‌లో దాదాపు అన్ని కంపెనీలు ప్యాసింజర్‌ కార్లు, ద్విచక్ర వాహనాల విక్రయాల్లో వృద్ధిని సాధించాయి. 2019తో పోలిస్తే ఈ దసరాకు ద్విచక్ర వాహన అమ్మకాలు తెలంగాణలో 10 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 20 శాతం అధికమయ్యాయి. కార్లు తెలంగాణలో 24 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 22 శాతం ఎక్కువయ్యాయి. దీపావళికి కార్లు, ద్విచక్ర వాహనాల సేల్స్‌ ఇరు రాష్ట్రాల్లో 10–15 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు తెలంగాణ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వై.రామ్‌ తెలిపారు. కరోనా విస్తృతి వేళ ఈ స్థాయి అమ్మకాలనుబట్టి చూస్తే పెద్ద రికవరీ జరిగిందని ఆయన అన్నారు. 

మరిన్ని వార్తలు